దేశంలోనే అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద జెట్ స్పీడ్‌తో పెరుగుతోంది. సరిగ్గా పదేళ్ల క్రితం ముకేశ్ అంబానీలో ఆరోవంతు సంపద కలిగిన అదానీ ఇప్పుడు సంపదలో ముకేశ్‌ను దాటి చాలా ముందుకెళ్లిపోయారు. రూ.10.94 లక్షల కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత కుబేరుడిగా అవతరించారు. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానంలో నిలిచారు. ఈ మేరకు 2022కు సంబంధించి భారత్‌లో అత్యంత ధనికుల జాబితాను ఐఐఎఫ్ఎల్ వెల్త్ వెల్లడించింది. గడిచిన ఏడాదిలో గౌతమ్ అదానీ సంపద 116 శాతం పెరిగినట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ తెలిపింది. అంటే సగటున రోజుకు రూ.1612 కోట్ల చొప్పున సుమారు రూ.5.88 లక్షల కోట్ల మేర సంపద పెరిగిందని పేర్కొంది. దీంతో గడిచిన పదేళ్లుగా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముకేశ్ అంబానీని గౌతమ్ అదానీ దాటేశారు. ప్రస్తుతం ముకేశ్ సంపద రూ.7.94 లక్షల కోట్లుగా ఉంది. గడిచిన ఏడాదిలో ముకేశ్ సంపద 11 శాతం పెరగ్గా ఐదేళ్లలో 115 శాతం పెరిగినట్లు ఐఐఎప్ఎల్ వెల్త్ పేర్కొంది.






