వస్తువులు రిటర్న్ చేసినా చార్జ్ వేస్తున్న ఫ్లిప్‌కార్ట్ .. మండిపడుతున్న యూజర్లు
దసరా, దీపావళి సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ సెలబ్రేషన్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 23 నుంచి 30 వరకు జరిగే ఈ సేల్స్‌లో భాగంగా ప్రముఖ బ్రాండ్లపై భారీ తగ్గింపులు లభించనున్నాయి. మరికొన్ని రోజుల్లో మొదలయ్యే ఈ సేల్స్ కోసం వినియోగదారులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫ్లిప్‌కార్ట్ నుంచి ఒక బాంబులాంటి వార్త వెలువడింది. ఇకపై ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసిన వస్తువులను రిటర్న్ చేస్తే.. దానిపై కొంత చార్జీ వసూలు చేస్తారట. ఇంతకుముందు మనం ఆర్డర్ ఇచ్చిన వస్తువులు నచ్చకపోయినా, డ్యామేజ్ అయినా వాటిని ఫ్రీగానే రిటర్న్ తీసుకునేది ఫ్లిప్‌కార్ట్. అయితే ఈ వస్తువులు అమ్మే వారికి వచ్చే నష్టాలను కొంత మేర పూడ్చేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు యూజర్లు దీనిపై సోషల్ మీడియా వేదికగా అక్కసు వెళ్లగక్కారు. వస్తువులు రిటర్న్ చేసే సమయంలో ఇలా రూ.50 వరకూ చార్జీ వసూలు చేయడమేంటని ఫ్లిప్‌కార్ట్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ రేటు మరీ భారీగా ఉందని కొందరు అంటుంటే.. అసలు రిటర్న్ చార్జీలు ఏంటని మరికొందరు అడుగుతున్నారు. ఏదేమైనా బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ముందు ఇది వినియోగదారులకు గట్టి షాకిచ్చే వార్తే.






