National Herald Case: 2 వేలకోట్లు కాజేసే యత్నం.. గాంధీ కుటుంబంపై ఈడీ సంచలన ఆరోపణలు

నేషనల్ హెరాల్డ్ కేసులో (National Herald Case) గాంధీ కుటుంబంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్ర ఆరోపణలు చేసింది. సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా చేజిక్కించుకునేందుకు ప్రయత్నించారని ఈడీ న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు ఢిల్లీ కోర్టుకు తెలిపారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కంపెనీ నష్టాల్లో ఉన్నప్పటికీ, దానికి రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఈడీ వెల్లడించింది. ఈ కంపెనీ రోజువారీ కార్యకలాపాల కోసం కాంగ్రెస్ పార్టీ (Congress) నుండి రూ.90 కోట్లు రుణం తీసుకుందని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. ఈ నేపథ్యంలో ఏజేఎల్ ఆస్తులను ‘యంగ్ ఇండియన్’ (Young India) అనే కంపెనీ ద్వారా స్వాధీనం చేసుకోవడానికి కుట్ర జరిగిందని ఎస్.వి. రాజు పేర్కొన్నారు. యంగ్ ఇండియన్ కంపెనీలో 76 శాతం వాటా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేరిటే ఉందని ఆయన వివరించారు. కేవలం రూ.90 కోట్ల రుణంతో రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులను సొంతం చేసుకోవడానికి గాంధీ కుటుంబం ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. దర్యాప్తులో మరిన్ని ఆధారాలు లభిస్తే కాంగ్రెస్ పార్టీని (Congress) కూడా ఈ కేసులో నిందితుల జాబితాలో చేర్చుతామని ఈడీ స్పష్టం చేసింది. గతంలో, ఈ కేసులో గాంధీ కుటుంబం రూ.142 కోట్ల లబ్ధి పొందినట్లు ఈడీ వెల్లడించిన సంగతి తెలిసిందే.