Political Parties: 474 రాజకీయ పార్టీలను రద్దు చేసిన ఈసీ

గుర్తింపు లేని, రిజిస్టర్ అయినప్పటికీ క్రియాశీలంగా లేని రాజకీయ పార్టీలపై (Political Parties) కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కఠిన చర్యలు తీసుకుంటోంది. గత ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయని 474 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు శుక్రవారం ఈసీ ప్రకటించింది. గత ఆగస్టు 9న కూడా 334 పార్టీలను రద్దు చేయగా, ఈ రెండు నెలల్లో మొత్తం 808 పార్టీలు (Political Parties) రద్దయ్యాయి.
ఈసీ నిబంధనల ప్రకారం, ఒక పార్టీ ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకపోతే, దానికి నోటీసులు జారీ చేసి దాని రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయవచ్చు. ఈ తాజా చర్యతో దేశంలో ఉన్న మొత్తం 2,520 గుర్తింపు లేని పార్టీల సంఖ్య 2,046కు తగ్గింది. ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు (Political Parties) మాత్రమే ఉన్నాయి.
రద్దు చేసిన జాబితాలో తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. వాటిలో మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ కూడా ఉంది. లోక్ సత్తాతో పాటు ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారత్ దేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీలు కూడా రద్దు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుండి 17 పార్టీలు (Political Parties) రద్దయ్యాయి.