Rahul Gandhi: లేఖ రాయలేదు, మీటింగ్‌కు రాలేదు.. రాహుల్ ప్రశ్నలపై ఈసీ!

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మాహా రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం (ఈసీ) (EC) ఘాటుగా స్పందించింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితబోధ చేసింది. అయితే ఎన్నికల సమయంలోని ఓటర్ల లిస్టు, సీసీటీవీ ఫుటీజేలను విడుదల చేస్తారా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనిపై ఈసీ అధికారులు తాజాగా స్పందించారు. రాహుల్ ఈ ప్రశ్నలన్నీ సోషల్ మీడియలో వేస్తున్నారు కానీ.. సమావేశంలో కానీ, లేదా లేఖ రూపంలో కానీ ఈసీని అడగలేదని వారు చెప్తున్నారు. పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత కోసం రాహుల్ కోరినట్లు సీసీటీవీ ఫుటేజీ విడుదల చేయాలంటే కొన్ని నిబంధనలున్నాయని, ఈ రకమైన డేటాను హైకోర్టు పర్యవేక్షణలో మాత్రమే పరిశీలించాల్సి ఉంటుందని ఈసీ (EC) వర్గాలు తెలిపాయి. ఎన్నికలపై తన అనుమానాలను పరిష్కరించుకోవాలంటే.. హైకోర్టులో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పిటిషన్ వేయాలని సూచించాయి. ఎన్నికల ఫుటేజీని బహిరంగంగా విడుదల చేయడం అంటే ఓటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్లేనని వివరించాయి.
అలాగే మే 15న ఈసీ ఏర్పాటు చేసిన పార్టీల మీటింగ్‌కు కాంగ్రెస్ గైర్హాజరైన విషయాన్ని కూడా గుర్తుచేశాయి. తాము ఈసీ నియమాలు, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నామని స్పష్టంచేశాయి. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలబెట్టేందుకు ఈసీ తీసుకునే జాగ్రత్తలను గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా తెలిపాయి. కాగా, రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వ్యాసంలో బీజేపీ ఐదు దశల్లో రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఈసీ వర్గాలు.. కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన బూత్ ఏజెంట్లు, కౌంటింగ్ ప్రతినిధులు కూడా ఎన్నికల సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదని, ఈ వ్యాఖ్యలు వారందర్నీ కూడా విమర్శించడమేనని పేర్కొన్నాయి. ఈ ఆరోపణలను ఈసీ (EC) ఖండించడంతో.. ఓటర్ల లిస్ట్‌ను విడుదల చేయాలని, సాయంత్రం తరువాతి పోలింగ్‌కు సంబంధించిన సీసీ ఫుటేజీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలా చేస్తే ఇక ఓటర్ల గోప్యత ఎక్కడుంటుందని ఈసీ తిరిగి ప్రశ్నించింది.