Congress: పవిత్ర కుంభమేళాలోనూ రాజకీయాలా…?

కుంభమేళాలో కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పవిత్ర కుంభమేళాలో స్నానమాచరిస్తే.. తమకు సద్గతులు కలుగుతాయని కోట్లాది మంది భక్తులు. ఇందుకు వీఐపీలు అతీతులు కాదు.. అయితే దీనికి తోడు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తే.. పుణ్యం, పురుషార్థం కూడా దక్కుతాయన్న అంచనాలున్నాయి. ఏదేమైతేనేం. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా(Amit Shah), పలువురు కేంద్రమంత్రులు.. ఇటీవలికాలంలో కుంభమేళాలో పవిత్రస్నానాలు ఆచరిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్అధ్యక్షుడు ఖర్గే సంచలన కామెంట్స్ చేశారు.
గంగానదిలో మునిగితే పేదరికం పోతుందా అని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే (kharge)ప్రశ్నించారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా మహూలో కాంగ్రెస్ ‘జై బాపూ, జైభీమ్, జై సంవిధాన్’ ర్యాలీ నిర్వహించింది. ఖర్గేతో పాటు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఖర్గే ప్రసంగిస్తూ.. తాను ఎవరి విశ్వాసాన్నీ ప్రశ్నించడం లేదన్నారు. తన మాటలకు ఎవరైనా బాధపడితే క్షమాపణ కూడా చెబుతున్నట్లు తెలిపారు.
‘ప్రధాని మోడీ తప్పుడు హామీల వలలో ప్రజలు చిక్కుకోవద్దు. గంగలో మునిగితే పేదరికం అంతమవుతుందా? మీ కడుపు నిండుతుందా? ఓపక్క పిల్లలు ఆకలితో ఆలమటిస్తున్నారు. వీళ్లు (బీజేపీ ప్రభుత్వం) రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు. గంగలో మునకలకు పోటీపడుతున్నారు. ఇలాంటి వారితో దేశానికి మేలు జరుగదు. మాకూ దేవుడిపై విశ్వాసం ఉంది. అయితే మతం పేరిట పేదలను వాడుకోవడంపైనే మాకు అభ్యంతరం’ అని తెలిపారు.
మోడీ, షా చాలా పాపాలు చేశారని.. వంద జన్మలెత్తినా వారు స్వర్గానికి వెళ్లరని చెప్పారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని.. దశాబ్దాలుగా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ వస్తోందని.. ఇతర మతస్థుల మనోభావాలను పురాతన పార్టీ ఇలా దెబ్బతీయగలదా అని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా నిలదీశారు. ‘ఖర్గే వ్యాఖ్యలు కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. ఇఫ్తార్ పార్టీకి వెళ్తే ఉద్యోగాలు వస్తాయా.. పేదరికం పోతుందా అని సోనియా, రాహుల్ అడుగగలరా’ అని సవాల్ విసిరారు.