Deve Gowda: చంద్రబాబును ఇరుకున పెట్టిన దేవెగౌడ..! వాస్తవమేనా..?

ప్రస్తుతం దేశంలో మోదీ (PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే (NDA) సర్కార్ అధికారంలో ఉంది. ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన మోదీ.. మూడోసారి కూడా నెగ్గి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. బీజేపీకి (BJP) సొంతంగా మెజారిటీ దక్కిన సందర్భాల్లో కూడా తమ మిత్రపక్షాలతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీయే మిత్రపక్షాలను ఆయన వదులుకోలేదు. ఇప్పుడు సొంతంగా బలం లేకపోయినా మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా మోదీయే సుప్రీం పవర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎన్డీయేకి సారథ్యం వహించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆసక్తి చూపించారని, ఇందుకు మోదీ అంగీకరించలేదని మాజీ ప్రధాని దేవెగౌడ (Devegowda) చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపాయి.
రాజ్యసభలో (Rajyasabha) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్బంలో మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపాయి. ఈ సందర్భంగా మోదీ గొప్పతనాన్ని, తన ఎదుగుదలను వర్ణించేందుకు దేవెగౌడ ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఎన్డీయేకి ఛైర్మన్ (NDA Chairman) లేదా వైస్ ఛైర్మన్ (NDA Vice Chairman) ప్రస్తావన తీసుకొచ్చారు. తనకు తెలిసినంత వరకూ చంద్రబాబు నాయుడు ఎన్డీయే ఛైర్మన్ లేదా వైస్ ఛైర్మన్ కావాలని కోరారని.. అయితే అందుకు మోదీ అంగీకరించలేదని చెప్పారు. ఎన్డీయేలో రెండు పవర్ సెంటర్స్ ఉండేందుకు మోదీ అంగీకరించలేదని.. ఆయన చేసే పనులపైన ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంటుందని దేవెగౌడ పొగిడారు.
అయితే దేవెగౌడ వ్యాఖ్యలను వెంటనే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సభలోనే ఖండించారు. అసలు అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని, దానిపైన చర్చే జరగలేదని నడ్డా స్పష్టం చేశారు. అయితే మోదీని పొగిడేందుకు చంద్రబాబు నాయుడి పేరును దేవెగౌడ తీసుకురావడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు మరోసారి తన అవకాశవాద రాజకీయాలను వాడుకునేందుకు ప్రయత్నించారని వైసీపీ (YCP) లాంటి పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. దేవెగౌడ ఇలా ఎందుకు కామెంట్ చేశారో అర్థం కాక ఎన్డీయే కూటమి పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఆయన కామెంట్స్ కూటమిలో ఇబ్బందికర పరిస్థితులకు దారితీసే ప్రమాదముందని గ్రహించిన నడ్డా వెంటనే ఆయన కామెంట్స్ ను ఖండించారు.
వాస్తవానికి 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా అణిగిమణిగి ఉంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం తమ మద్దతుపై ఆదారపడి నడుస్తోందనే విషయం చంద్రబాబుకు తెలుసు. సహజంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చంద్రబాబు చెలరేగిపోతుంటారు. చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే మోదీ పవర్ ఏంటో బాగా తెలిసొచ్చిన చంద్రబాబు ఈ ఎన్నికల తర్వాత అలాంటిపనులేవీ చేయకుండా కామ్ గా ఉంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలో ముఖ్యమని స్పష్టం చేశారు. కాబట్టి ఎన్డీయే ఛైర్మన్ లేదా వైస్ ఛైర్మన్ పదవి అడిగి ఉంటారని భావించలేం. ఒకవేళ అలా అడిగినా దానికి మోదీ అంగీకరిస్తారని ఆశించలేం. ఎందుకంటే తను కాకుండా మరో పవర్ సెంటర్ ఉండేందుకు మోదీ అంగీకరించే టైప్ కాదు.