Delhi CM: రేఖా గుప్తా ప్రస్థానం..

రేఖా గుప్తా..ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రిగా అనూహ్యంగా ఎంపికయ్యారు. హరియాణాలోని జులానాలో 1974 జులై 19న జన్మించిన రేఖా గుప్తా.. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్‌రామ్ కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలోనే (1992) ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పని చేశారు. 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు. మేరఠ్‌లోని చౌధరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం న్యాయవాదిగా పని చేశారు. 1998లో మనీశ్ గుప్తాను వివాహం చేసుకున్నారు.
2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు రేఖా గుప్తా. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆరెస్సెస్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.
బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేల్‌ల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న 5వ మహిళ రేఖా గుప్తా. దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టనున్న 18వ అతివగా రేఖా గుప్తా నిలవనున్నారు.