Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం..! అక్కడ ఆప్, ఇక్కడ బీఆర్ఎస్ ఖతం..!!

రాజకీయాల్లో (Politics) ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రజల మనసులను నిత్యం గెలుస్తూ ఉంటేనే రాజకీయ నేతలకు మనుగడ ఉంటుంది. లేకుంటే ఎంతటి మహామహులనైనా ప్రజలు ఇంటికి పంపించేస్తుంటారు. ప్రజలకు ఎలాంటి సెంటిమెంట్లూ ఉండవు. ఎప్పటికప్పుడు మూడ్ మారిపోతూ ఉంటుంది. గతంలో చేసిన మంచిని మాత్రమే గుర్తు పెట్టుకుని చెడుని మర్చిపోతారనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో (Delhi Elections), గతంలో తెలంగాణలో (Telangana Elections) ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఒకే ఒక్క అంశం రెండు పార్టీ పార్టీలను ఇంటికి పరిమితం చేసింది. అదే ఢిల్లీ లిక్కర్ స్కాం.
ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor scam) గురించి తెలియని వారుండరు. దాదాపు మూడేళ్లుగా ఈ వ్యవహారం బాగా వార్తల్లో నిలిచింది. ఢిల్లీలో ఆప్ (AAP) ప్రభుత్వం మద్యంపాలసీలో (Liquor Policy) అక్రమాలు జరిగాయంటూ లెఫ్టినెంట్ గవర్నర్ (Leftinent Governor – LG) ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సీబీఐ (CBI) విచారణ చేపట్టింది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కూడా భాగస్వాములని అటు సీబీఐ, ఇటు ఈడీ నిర్ధారించింది. ఢిల్లీ సీఎం కేజ్రివాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో (Manish Sisodia) పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె (BRS MLC Kavitha) కవిత కూడా ఈ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఈ రెండు పార్టీలపై మద్యం మరక పడింది.
అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) అవినీతికి వ్యతిరేకంగా పోరాడి రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మద్యం స్కాంలో ఇరుక్కోవడం, జైలుకు వెళ్లడం ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. మద్యం స్కాం జరగలేదని ఆప్ నేతలు ఎంత చెప్పినా ప్రజలు మాత్రం దాన్ని అంగీకరించలేదు. వాస్తవానికి లిక్కర్ స్కాం తర్వాతే ఆప్ పతనం ప్రారంభమైందని చెప్పొచ్చు. సౌతిండియా లిక్కర్ మాఫియాతో చేతులు కలిపి ఆప్ అవినీతికి పాల్పడిందని ఢిల్లీ పత్రికలు కోడైకూసాయి. ఈ అంశాన్ని బీజేపీ పూర్తిగా వాడుకుంది. తమ చేతుల్లోని సంస్థలను ప్రయోగించి ఆప్ అవినీతిని ఎండగట్టే ప్రయత్నం చేసింది. చివరకు తాజా ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడానికి ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రధాన కారణమని అర్థమవుతోంది.
ఇక తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) ఓటమికి కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం ఓ కారణం. తెలంగాణ తెచ్చిన కృతజ్ఞతగా కేసీఆర్ (KCR) కు పదేళ్లపాటు అధికారం ఇచ్చారు ప్రజలు. అయితే రెండో విడత అధికారంలో బీఆర్ఎస్ నేతలు పక్కదారి పట్టారని ప్రజలు భావించారు. ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవితే నేరుగా లిక్కర్ స్కాంలో ఇరుక్కోవడం, జైలుకు వెళ్లడం లాంటివాటిని ప్రజలు హర్షించలేదు. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అనే అహం కూడా ఆ పార్టీ నేతల్లో బలంగా నాటుకుపోయింది. ఇలాంటివన్నీ బీఆర్ఎస్ పతనానికి కారణమయ్యాయి. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కాం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను మార్చేసింది.