Delhi Elections: కేజ్రీ‘వాల్’ ను కూల్చేసిన కమలం..! ఎలా సాధ్యమైంది..?

ఢిల్లీ ఎన్నికల్లో (Delhi Elections 2025) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓడిపోయింది. బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీని (Delhi) బీజేపీ ఏలబోతోంది. పదేళ్లుగా ఢిల్లీని తమ గుప్పిట్లో పెట్టుకున్న ఆప్.. ఈ ఎన్నికల్లో అధికారానికి దూరమైంది. ముఖ్యంగా ఆప్ అధినేత కేజ్రివాల్ (Arvind Kejriwal) సైతం ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఆప్ ను ఓడించేందుకు బీజేపీ ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. దేశాన్ని ఏలుతున్నా ఢిల్లీ తమ వశం కావట్లేదనే బాధలో ఉన్న బీజేపీ.. కేజ్రివాల్ ను ఢీకొట్టేందుకు తమ ముందున్న అస్త్రాలన్నింటినీ ఉపయోగించింది. చివరకు కేజ్రీ వాల్ ను కూల్చేసింది.
దేశంలో తిరుగులేని శక్తిగా అవతరించింది బీజేపీ. అయితే ఢిల్లీలో మాత్రం ఆ పార్టీ పప్పులుడకట్లేదు. పదేళ్లుగా ఆ పార్టీతో కమలం పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అనేక అంశాల్లో అభిప్రాయ బేధాలున్నాయి. ఇది బీజేపీకి పెద్ద సమస్యగా మారింది. అందుకే ఎలాగైనా ఆప్ ను ఓడించి ఢిల్లీని కైవసం చేసుకోగలిగితే ఇబ్బందులు ఉండవని భావించింది. అందుకోసం వ్యూహాత్మకంగా దాదాపు రెండేళ్ల నుంచే తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయినా ఎన్నికల్లో గెలుపుపై అనేక అనుమానాలు కమలం పార్టీ శ్రేణుల్లోనే ఉండేవి. పోలింగ్ ముగిసి ఎగ్జిట్ పోల్స్ వచ్చేవరకూ బీజేపీ నేతలకు గెలుపుపై ధీమా లేకపోయింది.
పదేళ్ల కేజ్రివాల్ సామ్రాజ్యాన్ని బీజేపీ కుప్పకూల్చింది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి, అక్రమాలననే బీజేపీ తమ అస్త్రాలుగా మలుచుకుంది. ఢిల్లీ లిక్కర్ (Delhi Liquor Scam) స్కాం బీజేపీకి ఎంతో దోహదపడింది. పేదల మాటన కేజ్రివాల్ అవినీతికి పాల్పడుతున్నారని, అత్యాధునిక శీష్ మహల్ లో నివసిస్తున్నారని ఎత్తిచూపింది. కేజ్రివాల్ ఇంట్లో పరదాల ఖరీదెంతో తెలుసా అని ఓటర్లద్వారానే సమాధాన్ని రాబట్టేలా చేసింది. అంతేకాక కేంద్ర ప్రభుత్వ పథకాలను ఢిల్లీలో అమలు చేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వంతో నిత్యం పేచీ పెట్టుకోవడం ద్వారా న్యూఢిల్లీ పరువును బజారున పడేస్తోందని విమర్శించింది.
కేజ్రీవాల్ పోరాటయోధుడు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అతని వ్యవహారశైలి, మాటతీరు పూర్తిగా మారిపోయాయి. అవినీతి మచ్చ అంటింది. అహం పెరిగిపోయింది. కాంగ్రెస్ లాంటి పార్టీలను కూడా చిన్నచూపు చూడడం, మిత్రపక్షాలను గౌరవించకపోవడం, ఆతిశీ లాంటి జూనియర్లను అందలం ఎక్కించి సీనియర్లను పక్కన పెట్టడం, కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమవడం లాంటి అనేక అంశాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలు. ఢిల్లీ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే చాలు.. అభివృద్ధి జరగకపోయినా పర్లేదు అనే ధోరణిలో కేజ్రివాల్ వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ తో నిత్యం తగవు పెట్టుకోవడం కూడా ఢిల్లీ ప్రజలకు నచ్చలేదు. అందుకే పార్టీని ఓడించడమే కాకుండా కేజ్రివాల్ ను కూడా ఇంటికి పంపించేశారు.