AICC: సర్థార్ పటేల్ స్ఫూర్తి.. మతతత్వం, విభజనవాద రాజకీయాలపై పోరాటం – కాంగ్రెస్

మతతత్వం, విభజనవాద రాజకీయాలపై సర్దార్(sardar) వల్లభ్‌భాయ్ పటేల్ స్ఫూర్తితో పోరాడనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. హింస, మతతత్వాలు మన దేశాన్ని అగాధంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. వీటిపై పోరులో సర్దార్ పటేల్ మార్గాన్ని అనుసరించేందుకు కంకణబద్ధులై ఉంటామని పేర్కొంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సర్దార్ పటేల్ స్మారకం వద్ద నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) విస్తృతస్థాయి సమావేశం ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. పటేల్, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మధ్య విభేదాలున్నట్లు బీజేపీ తరచూ చెప్పడం ఉద్దేశపూర్వక దుష్ప్రచారమని, ఇది స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిపైనే దాడిగా అభివర్ణించింది. మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్‌ల నాయకత్వాన్ని విడదీసి చూడలేమంది.
విభేదాలు ఏనాడూ లేవు
కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ప్రారంభోపన్యాసం చేస్తూ… ‘‘స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతీయ నాయకులు పటేల్, నెహ్రూల మధ్య ఎప్పుడూ సత్సంబంధాలే ఉండేవి. వారిద్దరూ ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు. స్వాతంత్య్ర సమరంలో ఎలాంటి పాత్ర లేనివాళ్లు ఇప్పుడు పటేల్ వారసులమంటూ ప్రకటించుకోవడం హాస్యాస్పదం. బీజేపీ-ఆరెస్సెస్ కలిసి దేశంలో మతపరమైన విభజనలకు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ 140 ఏళ్లుగా దేశ సేవలో నిమగ్నమై ఉంది. స్వాతంత్య్ర సమరంలో ఎంతో పోరాడింది. అలాంటి పార్టీపై బురద జల్లాలని చూస్తున్నారు. పటేల్‌తో నెహ్రూకు మంచి అనుబంధం ఉండేది. వారి మధ్య నిరంతరం ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. పటేల్ అంటే అమిత గౌరవం ఉండటంతో ఏదైనా సలహా తీసుకోవాల్సి వస్తే నెహ్రూనే పటేల్ ఇంటికి వెళ్లేవారు. పటేల్ సౌలభ్యం దృష్ట్యా సీడబ్ల్యూసీ సమావేశాలను ఆయన ఇంట్లోనే నిర్వహించేవారు. ఆ నాయకులు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండేవారని చిత్రీకరించే కుట్ర చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.
కాంగ్రెస్‌లో మాత్రమే గాంధీ సిద్ధాంతాలు..
గాంధీకి సంబంధించిన సంస్థల్ని బీజేపీ, సంఘ్ పరివార్‌లు స్వాధీనం చేసుకుని, ఆయనకు సైద్ధాంతిక వ్యతిరేకులైనవారికి అప్పగిస్తున్నాయని ఖర్గే ఆరోపించారు. గాంధీ కళ్లజోళ్లు, చేతికర్రను వీరు దొంగిలించగలరేమోగానీ ఆయన సిద్ధాంతాలను మాత్రం కాదని, అసలైన ఆస్తిలాంటి ఆ సిద్ధాంతాలు కాంగ్రెస్‌లో మాత్రమే ఉన్నాయన్నారు. ఆరెస్సెస్ ఆలోచనలు, పటేల్ భావజాలానికి పొంతనే లేదన్నారు. గాంధీ హత్యకు గురైన తర్వాత ఆరెస్సెస్‌ను పటేల్ నిషేధించారని గుర్తుచేశారు. ‘‘అంబేద్కర్‌ను భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా చేయడంలో గాంధీ, పటేల్ కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని రాజ్యాంగ పరిషత్ వేదికగా తన చివరి ప్రసంగంలో అంబేద్కర్ ప్రస్తావిస్తూ- కాంగ్రెస్ మద్దతులేనిదే రాజ్యాంగ రూపకల్పన జరిగేదే కాదని చెప్పారు’’ అని తెలిపారు. ‘‘సర్దార్ పటేల్ మా హృదయాల్లో, మా ఆలోచనల్లో ఉంటారు. ఆయన వారసత్వాన్ని మేం ముందుకు తీసుకువెళ్తున్నాం’’ అని వివరించారు.
పటేల్ 150వ జయంతి సంవత్సరం సందర్భంగా ప్రత్యేకంగా ఒక తీర్మానం చేశామని పార్టీ సీనియర్ నేత కె.సి.వేణుగోపాల్ విలేకరులకు తెలిపారు. గుజరాత్‌పై ఒకటి, దేశ రాజకీయాలపై ఒకటి చొప్పున రెండు తీర్మానాలను విస్తృత సీడబ్ల్యూసీలో చర్చించామని, ఆమోదం నిమిత్తం వాటిని బుధవారం నాటి ఏఐసీసీ సమావేశంలో ప్రవేశపెడతామని ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. పార్టీని ఈ ఏడాది పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. దీనిపైనే ప్రధానంగా చర్చించారు. సామాజికన్యాయ మార్గంలో పయనిస్తామని నేతలంతా ఉద్ఘాటించారు. డీసీసీ అధ్యక్షుల అధికారాలు పెంచనున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమిపై తగిన బలంతో కాంగ్రెస్ పోరాడుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ తెలిపారు. పాదయాత్రల వంటి కార్యక్రమాల ద్వారా ఇంటింటికీ పార్టీని చేరువ చేస్తామని తెలిపారు. బుధవారం జరిగే సదస్సుకు ‘న్యాయ్‌పథ్’ అనే పేరు పెట్టామన్నారు.