ఏక్‌నాథ్ శిందేతో సీఎం చంద్రబాబు భేటీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో కలిసిన ఈ ఇద్దరు నేతలు కొంతసేపు ఆత్మీయంగా మాట్లాడుతకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును శిందే తన నివాసానికి ఆహ్వానించారు. తన అధికారిక నివాసమైన వర్షకు విచ్చేసిన చంద్రబాబుకు శిందే సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, పలు రంగాల్లో పరస్పర సహకారం, మౌలిక వసతుల అభివృద్ధి, పలు ఆర్థిక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇద్దరు సీఎంల మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది.