Rammohan Naidu: వారి బాధ అర్థం చేసుకోగలను : రామ్మోహన్ నాయుడు

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన దుర్ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలిపారు. విమానయాన భద్రతపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలిలో సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గుజరాత్ (Gujarat) ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే మంటలార్పి మృతదేహాలను అక్కడి నుంచి తరలించాం. దుర్ఘటనపై విచారణకు తక్షణమే ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశాం. అవసరమైతే మరికొంత మంది సభ్యులనూ బృందంలో చేరుస్తాం. శుక్రవారం సాయంత్రం ఘటనాస్థలిలో బ్లాక్ బాక్స్ (Black box )దొరికింది. దానిని విశ్లేషించిన తర్వాత ఏం జరిగిందనేది పూర్తిగా తెలుస్తుంది. అందులో ఏముందో తెలుసుకునేందుకు మేమూ ఆతృతగా ఎదురుచూస్తున్నామన్నారు.
దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాల బాధను అర్థం చేసుకోగలను. నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు. ఆ బాధ నాక్కూడా తెలుసు. హోంశాఖ సెక్రెటరీ (Home Secretary) ఆధ్వర్యంలో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. ప్రత్యేక అధికారులతో, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశాం. సంపూర్ణ దర్యాప్తు జరిపేందుకు ఈ కమిటీ సభ్యులు దోహదపడతారు. నిపుణుల విచారణ పూర్తయ్యాక తగిన సమయంలో మీడియా (Media)కు సమాచారమిస్తాం. రెండు నెలల్లోగా విచారణ పూర్తవుతుందని భావిస్తున్నాం. అంతేకాకుండా బోయింగ్ 787 సిరిస్‌ను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశించాం అని తెలిపారు.