Kerala: కేరళ సీఎంకు షాక్.. అవినీతి కేసులో కుమార్తె వీణ విచారణకు కేంద్రం అనుమతి

కేరళ (Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు షాక్ తగిలింది. అవినీతి కేసులో కుమార్తె టి.వీణ(Veena)ను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్‌లో అవకతవకలు జరగడంలో వీణ పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. కంపెనీల చట్టం ఉల్లంఘన కింద ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ సమర్పించిన నేపథ్యంలో వీణను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఒకవేళ దోషిగా తేలితే పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వీణా విజయన్‌కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి అక్రమంగా నగదు బదిలీ అయినట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ఆధారంగా కేసు విచారణకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.
2017-2020 మధ్య కాలంలో సీఎంఆర్ఎల్ కంపెనీ నుంచి వీణా విజయన్‌కు చెందిన కంపెనీకి రూ. 1.72 కోట్లు బదిలీ అయినట్లు తేలింది. దీంతో ఈ కేసులో విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐఓ ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎఫ్ఐఓ తన ఛార్జ్‌షీట్‌లో వీణా విజయన్‌తో పాటు సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిథర్ కార్తా, మరో 25 మంది నిందితుల పేర్లను చేర్చింది.