Monica Kapoor :26 ఏళ్లుగా భారత్ కు సవాల్.. ఎట్టకేలకు మోనికా కపూర్ అరెస్ట్

ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్ (Monica Kapoor) కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు పురోగతి సాధించారు. దాదాపు 26 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. అమెరికా (America)లో తలదాచుకుంటున్న ఆమెను సీబీఐ అధికారులు (CBI officials) అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో భారత్‌కు తీసుకువస్తున్నారు. ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందంలో భాగంగా అమెరికా మోనికా కపూర్ ను భారత్ (India)కు అప్పగించింది. మోనికా తరలింపును ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకువస్తున్నారు. మోనికా కపూర్ 1999 లో కోట్ల రూపాయల ఆర్థిక నేరానికి పాల్పడింది. నకిలీ పత్రాలతో ఆభరణాల వ్యాపారం చేసింది. మోసపూరితంగా డ్యూటీ ఫ్రీ లైసెన్సులు పొందింది. ఆమె మోసం కారణంగా భారత ప్రభుత్వం ఏకంగా రూ.5కోట్లు నష్టపోయింది. ఈ ఆర్థిక మోసంలో మోనికా ఇద్దరు సోదరులు కూడా భాగమయ్యారు.
తన మోసం బయటపడితే అరెస్ట్ తప్పదని మోనికా భావించింది. 1999లో అమెరికా పారిపోయింది. అప్పటి నుంచి అక్కడే తలదాచుకుంటూ ఉంది. 2004లో ఆమెపై సీబీఐ కేసు నమోదు అయింది. మోనికాను అప్పగించాలని 2010లోనే భారత్, అమెరికాను విజ్ణప్తి చేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే సరికి ఇంతకాలం పట్టింది. అయితే, తనను ఇండియాకు అప్పగించవద్దని, అక్కడికి తీసుకెళ్లి హింసిస్తారని అమెరికా కోర్టు (American court ) లో మోనికా పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టిపారేసింది. అనంతరం యూఎస్ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ మోనికాకు సరెండర్ వారెంట్ పంపింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.