Obulapuram: ఓబుళాపురం మైనింగ్ కేసు… గాలి జనార్దన్‌రెడ్డికి ఏడేళ్లు జైలుశిక్ష

ఓబుళాపురం మైనింగ్ కేసు (Obulapuram mining case )లో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది.ఈ కేసులో ప్రధాన నిందితలైన గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) , బీవీ శ్రీనివాసరెడ్డి (B.V. Srinivasa Reddy), మెఫజ్ అలీఖాన్ (Mefaz Ali Khan) , గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్ (Rajagopal)ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి సహా నలుగురికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. అలాగే, దోషులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడిరచింది. ఈ కేసులో దోషిగా తేలిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకు రూ.2 లక్షలు జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంధ్రారెడ్డి (Sabitha Indhra Reddy)కి ఉపశమనం లభించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.