ప్రధాని మోదీ సన్నిహితుడికి యూపీ బీజేపీలో కీలక పదవి

ఉత్తరప్రదేశ్ బీజేపీపై ప్రధాని మోదీ ‘నీడ’ పడింది. మాజీ ఐఏఎస్ అధికారి, మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఏకే శర్మకు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఆయనను యూపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం యోగికి, ప్రధాని మోదీకి మధ్య గ్యాప్ పెరిగిందని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికలకు కొంత సమయం ఉందనగానే ఏకే శర్మకు కీలక బాధ్యతలు అప్పజెప్పడం గమనార్హం. గతంలో ఈయన 18 నెలల పాటు మోదీ టీంలో కీలక అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే మంత్రివర్గంలో ఈయనకు స్థానం లభించనుందని, సీఎం యోగి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. అయితే అవేవీ కాకుండా ఏకే శర్మకు ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పడం పార్టీలో సంచలనమై కూర్చుంది. మరోవైపు సీఎం యోగిపై బ్రాహ్మణులు కినుక వహించారని, తమను ఏమాత్రం యోగి పట్టించుకోలేదని బ్రాహ్మణులు ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏకే శర్మను కేబినెట్‌లోకి తీసుకొని, ఆ వర్గానికి సానుకూల సంకేతాలు పంపాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ కారణంగానే జితిన్ ప్రసాదను కూడా బీజేపీలోకి తీసుకున్నారు.