BCCI: బెంగుళూరు తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ సీరియస్..

ఆర్సీబీ(RCB) విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తించింది. 11మంది మృతికి కారణమైన ఈ ఘటనను బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వేడుకల నిర్వహణకు మార్గదర్శకాల జారీకి ఆలోచన చేస్తోంది. ఈమేరకు బీసీసీఐ (BCCI) సెక్రటరీ దేవాజిత్ సైకియా మీడియాతో మాట్లాడారు (BCCI on Bengaluru Stampede).
‘‘మేం మౌనంగా చూస్తూ ఉండలేం. ఏదోఒకటి చేయాలి. ఇది ఆర్సీబీకి సంబంధించిన ప్రైవేటు వ్యవహారం. కానీ ఈ దేశంలో క్రికెట్ వ్యవహరాలకు మేం బాధ్యత తీసుకోవాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై టీమ్‌ఇండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే స్పందించారు. ‘‘నేను ఆడేటప్పుడైనా.. ఇప్పుడైనా, భవిష్యత్తులోనైనా సరే.. విజయోత్సవ ర్యాలీలను సమర్థించను. ఇలాంటివి ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తాయి. గెలవడం ముఖ్యం.. వేడుకలు కాదు. అన్నింటికంటే వ్యక్తులు జీవితాలు ముఖ్యం. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా లేకపోతే.. ఈ రోడ్‌షోలు నిర్వహించకపోవడమే మంచిది’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఇ.ఎస్. జైరాం తమ పదవులకు రాజీనామా చేశారు. ఆర్సీబీ (RCB) యాజమాన్యం, కేఎస్‌సీఏ (KSCA) అధ్యక్షుడు రఘురామ్ భట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ను బాధ్యులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటికే బెంగళూరు నగర కమిషనర్ బి.దయానంద్‌ను సస్పెండ్ చేయగా.. సీఎం సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శిని విధుల నుంచి తొలగించారు. మరికొందరు ఉన్నతాధికారులపైనా బదిలీ/సస్పెన్షన్ వేటు పడింది.ఇక, ఈ ఘటనకు సంబంధించిన ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలెతో పాటు డీఎన్‌ఏ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు సునీల్ మ్యాథ్యూ, కిరణ్, సుమంత్‌లను పోలీసులు అరెస్టు చేశారు.