IPL: ఐపిఎల్ ఆగదు: బీసీసీఐ

జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి భారత ఆర్మీ(Indian Army) ప్రతీకారం తీర్చుకున్న నేపధ్యంలో పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది. ఆపరేషన్ సిందూర్ జరగడంతో యుద్ధం తధ్యం అనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ తరుణంలో ఐపిఎల్(IPL) నిర్వహిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపధ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.. క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం మే 25 వరకు జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ సాధారణంగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా అమలు చేసిన తర్వాత.. ఐపిఎల్ ఆగిపోయే అవకాశం ఉందని భావించారు. ప్రస్తుత పరిస్థితులు ఐపిఎల్ షెడ్యూల్, మ్యాచ్‌లపై ఎటువంటి ప్రభావం చూపవని, అది షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని తెలిపింది. ఐపిఎల్ విషయంలో.. అభిమానుల్లో ఆందోళన మొదలు కావడంతో బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. సరిహద్దులకు దగ్గరగా ఉన్న మైదానాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది ఇండియన్ ఆర్మీ. ధర్మశాల, సహా పంజాబ్ లోని కీలక మైదానాల్లో భద్రతను పెంచారు.
భారత దళాలు పాకిస్తాన్‌లోని బహవల్పూర్, మురిడ్కే, సియాల్‌కోట్‌లోని కీలక ప్రదేశాలతో సహా నాలుగు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది భారత ఆర్మీ. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పిఒజెకె)లోని మరో ఐదు లక్ష్యాలను కూడా విజయవంతంగా ధ్వంసం చేసింది. భారత సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) మరియు లష్కరే-ఎ-తోయిబా (ఎల్‌ఇటి) అగ్ర నాయకులను లక్ష్యంగా ఈ దాడి జరిగింది.