Astha Poonia: భారత నేవీలో తొలి మహిళా పైలట్.. వింగ్స్ ఆఫ్ గోల్డ్ అందుకున్న ఆస్థా పూనియా

భారత నౌకాదళ చరిత్రలో అరుదైన ఘట్టానికి తెరలేచింది. సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా (Astha Poonia) నౌకాదళంలో మహిళా ఫైటర్ పైలట్‌గా నియమితులై.. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్ డేగాలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో పూనియాకు ప్రతిష్టాత్మకమైన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ (బంగారు రెక్కలు) ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ (ఎయిర్) రియర్ అడ్మిరల్ జానక్ బెవిల్ అధ్యక్షత వహించారు. పూనియాతో (Astha Poonia) పాటు, లెఫ్టినెంట్ అతుల్ కుమార్ ధుల్ కూడా సెకండ్ బేసిక్ హాక్ కన్వర్షన్ కోర్సును పూర్తి చేసి నేవీలో ఫైటర్ పైలట్‌గా చేరారు. “నేవల్ ఏవియేషన్‌లో ఇదొక కొత్త శకానికి నాంది” అని భారత నౌకాదళం ఈ సందర్భంగా పేర్కొంది. ఇది సాయుధ దళాలలో లింగ సమానత్వం, మహిళా సాధికారతకు ఒక ముఖ్యమైన ముందడుగు అని నేవీ వర్గాలు అంటున్నాయి.