Rahul Gandhi: రాహుల్ జీ.. జర.. సోచో జీ..

Congress: కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ పద్దతిగా నడిచే పార్టీ. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆపార్టీ ఏనిర్ణయం తీసుకోవాలన్న చాలా కమిటీలను దాటిన తర్వాతే బయటకు వచ్చేది. చట్టరూపం దాల్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అలా అనిపించడం లేదు. గాంధీ కుటుంబం చెప్పిన మాటనే.. కమిటీలు ఫైనల్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. సైద్దాంతిక భావజాలం పేరుతో రాజకీయంగా దారి తప్పారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం అంతా పవర్ పాలిటిక్స్.. ప్రధాని మోడీ నుంచి రాహుల్ గాంధీ(Rahul Gandhi) వరకూ అందరు నేతలు.. రాజకీయ అధికారం కోసమే యుద్ధం చేస్తారు. అయితే ప్రధాని మోడీ(modi) ఓట్లు రాల్చే పథకాలు, పక్కాగా ఓటుపడే అంశాలపై ఫోకస్ పెడుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం సైద్ధాంతిక భావజాలాన్ని పట్టుకు వేలాడుతున్నారు. సైద్ధాంతిక భావజాలం పార్టీలకు, నేతలకు ఉండడం మంచిదే.. కానీ దాన్ని చాలా తెలివిగా ప్రయోగించాలి. అంతే కానీ.. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు ఉండకూడదన్నది పెద్దల మాట.
అదానీ, అంబానీలాంటి కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని గులాంగిరీ చేస్తున్నారని రాహుల్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఎక్కడ మాట్లాడినా ఇదే మాట చెబుతున్నారు. ఇది ప్రజలకు అర్థమవుతోందా అంటే అర్థమవుతోంది అందులో సందేహం లేదు. అయితే.. ప్రజలు దీన్ని ఓ పెద్ద అంశంలా భావించడం లేదు. ఎవరి దగ్గర డబ్బు, పవర్ ఉంటే వారు చెప్పినట్లు జరుగుతుందన్నది భారతదేశంలో సామాన్య, మారుమూల పల్లెల్లోని జనం కూడా చెబుతారు. మరి .. దీనికి ఓట్లెలాపడతాయి. ఇది రాహుల్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ కు అర్థమవుతోందా.. అన్నది నిపుణుల మాట.
ఇక రాజ్యాంగం(constitution)పై దాడి జరుగుతోంది అంటారు రాహుల్. అయితే ఈ రాజ్యాంగం అనేది ఉందని చాలా మందికి తెలుసు.కానీ.. దానిపై దాడి జరిగితే వచ్చే పరిణామాలు ఏంటనేవి చాలా మందికి తెలియదు. ఇప్పుడు తమ జీవన సమస్యలపై ఎలా ముందుకెళ్లాలో చెప్పడం మాని.. రాజ్యాంగంపై దాడి అంటే.. వారికి ఇది ఏదో బ్రహ్మపదార్థంలా తోచే పరిస్థితి ఉంది. సరే రాజ్యాంగంపై దాడి జరిగితే ఏం చేయాలి..? దాన్ని పరిరక్షించేందుకు ఉన్న ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి. అవి చూసుకోవచ్చుగా కానీ.. ఎక్కడో దిగువస్థాయిలో ఉన్న మేేమేం చేస్తాం. అన్న మాటలు వినిపిస్తున్నాయి. అంటే అర్థం కానీ చాలా పదాలను రాహుల్ వల్లె వేస్తున్నారు. అవి ప్రజలకు ఎలా చేరుతాయి. వాటిని చేర్చే యంత్రాంగం కాంగ్రెస్ దగ్గర ఉందా.? లేకుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎలా సాధ్యమవుతుంది. వీటికి కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉందా..? వీటికి కాలమే సమాధానం చెప్పాలి.