Richest Party: మన పొలిటికల్ పార్టీల బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?

మన దేశంలో రాజకీయ పార్టీలకుండే (political parties) క్రేజ్ అంతా ఇంతా కాదు. రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకునే చాలా మంది ఏదో ఒక పార్టీలో చేరుతుంటారు. ఆ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకుంటూ ఉంటారు. అయితే సేవ చేస్తారో లేదో తెలీదు కానీ పాలిటిక్స్ లోకి ఎంటరైన తర్వాతా భారీగానే లబ్ది పొందుతుంటారు. అలాగే తమకు ఆశ్రయమిచ్చిన పార్టీలను కూడా విరాళాల (donations) రూపంలో ఆదుకుంటూ ఉంటారు. అలా రాజకీయ పార్టీల బ్యాంక్ బ్యాలెన్స్ (bank balance) కూడా ఏటికేడాది పెరుగుతూ ఉంటుంది. అయితే అధికారంలో ఉన్న పార్టీల ఖజానా గలగలలాడుతుంటుంది. ఓడిపోయిన పార్టీలకు మాత్రం నిధుల కటకట ఉంటుంది.
దేశంలోని రాజకీయ పార్టీల ఆడిటింగ్ వివరాలను ఎన్నికల సంఘం (election Commission) విడుదల చేసింది. దీని ప్రకారం పదేళ్లుగా దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) అతి ధనవంతమైన పార్టీగా నిలిచింది. ఆ పార్టీ దగ్గర 2024 మార్చి నాటికి రూ.7113.8 కోట్ల నగదు ఉంది. తాజా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ రూ.1754.06 కోట్లు ఖర్చు చేసింది. 2022-23 ఖర్చులతో పోల్చితే ఇది 60శాతం ఎక్కువ. 2023-24లో బీజేపీకి రూ. 1,685.69 కోట్లు, 2022-23లో రూ.1,294.15 కోట్లు వచ్చాయి. ఇతర విరాళ రూపంలో బీజేపీ 2023-24లో రూ. 2,042.75 కోట్లు పొందగా, 2022-23లో రూ.648.42 దక్కించుకుంది.
2023-24లో బీజేపీ ప్రకటనలపై రూ.591 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియాపై రూ. 434.84 కోట్లు, న్యూస్ పేపర్ ప్రకటనలపై రూ. 115.62 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో విమానాలు/హెలికాప్టర్ల కోసం రూ. 174 కోట్లు ఖర్చు చేయగా 2022-23లో ఇది రూ. 78.23 కోట్లుగా ఉంది. 2023-24లో బీజేపీ తమ అభ్యర్థులకు ఆర్థిక సహాయం కింద రూ. 191.06 కోట్లు ఇచ్చింది. ఇది 2022-23లో రూ.75.05 కోట్లుగా ఉంది. ఇక 2024లో సమావేశాల కోసం బీజేపీ రూ. 84.32 కోట్లు ఖర్చు చేయగా, 2023-24లో మోర్చా, ర్యాలీలు, ఆందోళనలు, కాల్ సెంటర్ల ఖర్చుల కోసం రూ. 75.14 కోట్లు వెచ్చించింది.
ఇక కాంగ్రెస్ (Congress) పార్టీ బ్యాంకులో రూ.857.15 కోట్లు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఏడాదిలో రూ. 619.67 కోట్లు ఖర్చు చేసింది. 2022-23లో రూ.192.56 కోట్లు మాత్రమే ఖర్చయింది. కాంగ్రెస్ పార్టీకి 2023-24లో రూ.1,225.11 కోట్ల విరాళాలు అందాయి. కాంగ్రెస్ పార్టీ 2023-24లో ఎలక్ట్రానిక్ మీడియాపై రూ. 207.94 కోట్లు,న్యూస్ పేపర్ యాడ్స్ కోసం రూ. 43.73 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో విమానాలు/హెలికాప్టర్ల కోసం రూ. 62.65 కోట్లు ఖర్చు చేయగా, తమ అభ్యర్థులకు ఆర్థిక సహాయంగా రూ. 238.55 కోట్లు అందించింది. అదనంగా ప్రచార వ్యయాలపై రూ. 28.03 కోట్లు, సామాజిక మాధ్యమాల ఖర్చులకు రూ. 79.78 కోట్లు ఖర్చు చేసింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2 కోసం 2023-24లో కాంగ్రెస్ రూ. 49.63 కోట్లు ఖర్చు చేసినట్లు ఆడిట్ నివేదిక పేర్కొంది. అంతకుముందు 2022-23లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ చేపట్టిన తొలి భారత్ జోడో యాత్ర కోసం రూ. 71.84 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
ఇక ప్రాంతీయపార్టీల విషయానికొస్తే భారత్ రాష్ట్ర సమితి (BRS) రిచ్చెస్ట్ పార్టీగా ఉంది. ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.1110 కోట్లు ఉంది. 2023-24లో బీఆర్ఎస్ కు రూ.580.52 కోట్ల విరాళాలు వచ్చాయి. ఫిక్సుడ్ డిపాజిట్ల ద్వారా రూ.101.76 కోట్లు జమయ్యాయి. మొత్తం రూ.685.5కోట్లలో రూ.254 కోట్లు ఖర్చు చేశారు. అంతకుముందు ఏడాది నిల్వ ఉన్న రూ.430 కోట్లు కలిపితే మొత్తం రూ.1110 కోట్లు బ్యాంకులో ఉన్నాయి. ఆ పార్టీ మొత్తం ఆస్తులు రూ.1618కోట్లుగా లెక్కగట్టారు. ఆ పార్టీ దగ్గర మొత్తం ఇప్పుడు రూ.1515 కోట్ల నిల్వలున్నాయి. ఏపీలోని టీడీపీ (TDP) దగ్గర రూ.265 కోట్లు, వైసీపీ (YSRCP) దగ్గర రూ.67 కోట్లు ఉన్నాయి.