Delhi Elections : ఢిల్లీ పీఠం దక్కెదెవరికి..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు (Delhi Assembly Elections) ముహూర్తం దగ్గర పడుతోంది. వచ్చే నెల 5న పోలింగ్ (Polling) జరగనుంది. 8న ఫలితాలు (Delhi election results) విడుదలవుతాయి. దీంతో ఢిల్లీ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ (BJP) మధ్యే పోరు నడిచేటట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ (Congress) పార్టీ ఈసారి కూడా నామమాత్రంగా మారే అవకాశం ఉంది. ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టాలని ఆప్ ప్రయత్నిస్తుంటే.. ఆ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టాలని బీజేపీ స్కెచ్ వేస్తోంది. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఢిల్లీలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి సత్తా చాటింది ఆమ్ ఆద్మీ పార్టీ. సామాన్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) ఢిల్లీని హస్తగతం చేసుకుని చరిత్ర సృష్టించారు. 2012లో పార్టీ పెట్టిన కేజ్రివాల్ 2013 ఉప ఎన్నికల్లో 28 సీట్లు గెలుచుకుని సత్తా చాటారు. అనంతరం 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70కి 67 సీట్లు సాధించి చరిత్ర సృష్టించారు. 2020లో కూడా 62 సీట్లతో తనకు తిరుగులేదనిపించుకున్నారు. ఈ ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లను బీజేపీ తొలగించిందని విమర్శిస్తున్నారు.
అయితే ఆప్ అవినీతిని అస్త్రంగా చేసుకుంది బీజేపీ. పదేళ్లలో అరవింద్ కేజ్రివాల్ భారీగా అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారని కమలం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా లిక్కర్ స్కాం (Delhi Liquor Scam), శీష్ మహల్ (Sesh Mahal) లాంటి వాటిని ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని గట్టిగా వినిపిస్తోంది. ఎన్నికల్లో గెలుపుకోసం బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమ వలసదారులను తెప్పించి ఆప్ ఓటర్లుగా చేర్పించిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. పైగా బీజేపీ ముఖ్యమంత్రులను, ఎన్డీయే (NDA) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఢిల్లీకి రప్పించి ప్రచారం చేస్తోంది. దేశాన్ని ఏలుతున్నా ఢిల్లీని మాత్రం బీజేపీ చేజిక్కించుకోలేకపోతోంది. పాతికేళ్లుగా ఇక్కడ పాగా వేయాలని చూస్తోంది. కానీ వర్కవుట్ కావట్లేదు. ఈసారి మాత్రం అవకాశాన్ని వదులుకోకూడదని గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే కనీసం కొన్ని స్థానాలనైనా దక్కించుకునే అవకాశం ఉండేది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. వాస్తవానికి ఆప్, కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలు. అయినా ఇక్కడ పొత్తు కుదరలేదు. పైగా ఇండియా కూటమిలోని టీఎంసీ, ఎస్పీ లాంటి పార్టీలు ఇక్కడ ఆప్ కు మద్దతు ప్రకటించాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఒంటరిపోరులో కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా పెద్దగా లాభపడేదేమీ ఉండకపోవచ్చని అంచనా. ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ఉండనుంది.