Amit Shah: మోదీ హయాంలో భారత్లో హింసకు తావులేదు: అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నాయకత్వంలో దేశం మరింత భద్రతగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. భారతదేశంలో హింసకు స్థానం లేదని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్న ఆయన.. లక్నోలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ప్రపంచానికి గట్టి సందేశం ఇచ్చిందన్న ఆయన (Amit Shah).. కాంగ్రెస్ పాలనలో ఉగ్రవాద దాడులు ప్రతి రోజూ జరిగేవని, వాటికి తగిన జవాబు ఇవ్వలేకపోయారని విమర్శించారు. కానీ మోదీ హయాంలో భారతదేశం ఇలాంటి చర్యలకు దీటుగా స్పందించిందని, మూడు సార్లు ఎదురుదాడులు జరిపిందని గుర్తు చేశారు. అభివృద్ధి దిశగా భారత్ వేస్తున్న అడుగులను కూడా అమిత్ షా వివరించారు. మెట్రో నెట్వర్క్ల విస్తరణ, అంతరిక్ష పరిశోధన, విద్యా రంగ అభివృద్ధి, విమానయానం విస్తరణ, యువతకు ఉద్యోగ అవకాశాలు, డిజిటల్ నైపుణ్యాల పెంపు వంటి రంగాల్లో దేశం ముందడుగు వేసిందని తెలిపారు. పట్టణీకరణలో దేశం గణనీయ పురోగతిని సాధించిందని కొనియాడారు.
అంతర్గత భద్రత విషయానికొస్తే, గతంలో 11 జిల్లాల్లో మావోయిస్టు ప్రభావం ఉండేదని, ప్రస్తుతం అది కేవలం మూడు జిల్లాలకు మాత్రమే పరిమితమైందని చెప్పారు. 2026 మార్చి నాటికి దేశం నుంచి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వ యత్నాలు సాగుతున్నాయని తెలిపారు. ఆర్థిక ప్రగతిపై మాట్లాడుతూ.. 2027 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదకొండు సంవత్సరాల్లో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని ఆయన (Amit Shah) పేర్కొన్నారు.






