Amit Shah: ఆ కారణంతో ఎవర్నీ కాపాడలేకపోయాం: అమిత్ షా

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగిన స్థలానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్వయంగా వెళ్లి అధికారులను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. ఆయన వెంట పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu), గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటేల్ (Bhupendra Patel) కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడి అమిత్ షా.. విమానంలో ఉన్న సుమారు 1.25 లక్షల లీటర్ల ఇంధనం భగ్గుమనడంతో తీవ్రంగా మంటలు వ్యాపించాయని, దీంతో ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని తెలిపారు. “విమానం భూమిని తాకిన వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఉష్ణోగ్రతలు భయంకరంగా పెరిగిపోయాయి. దీంతో ఎవరినీ రక్షించలేకపోయాం” అని షా (Amit Shah) విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు తప్ప మిగతా అందరూ మరణించినట్లు ఎయిరిండియా (Air India) ప్రకటించింది. “మృతుల కుటుంబాల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరిస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మృతుల సంఖ్యపై కూడా స్పష్టత వస్తుంది. ఇదే ప్రక్రియను విదేశీ పౌరుల కుటుంబాల విషయంలోనూ వేగంగా పూర్తి చేస్తాం” అని షా (Amit Shah) అన్నారు. అత్యంత విషాదకర ఘటన అయిన ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్‌ను కూడా షా పరామర్శించారు. కేంద్రం తరఫున బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. “ఈ విషాద ఘట్టం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది” అని పేర్కొన్నారు.