Amit Shah: వివాదానికి దారి తీసిన అమిత్ షా కామెంట్స్..!!

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల (vice president elections) సందర్భంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై (Justice B Sudarshan Reddy) కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి (naxalism) మద్దతిచ్చారని, 2011లో సల్వా జుడుం (Salwa Judum) కేసులో ఆయన ఇచ్చిన తీర్పు వల్ల నక్సల్ ఉగ్రవాదం దేశంలో మరింత బలపడిందని అమిత్ షా ఆరోపించారు. ఈ తీర్పు లేకపోయి ఉంటే, 2020 నాటికే నక్సలిజాన్ని పూర్తిగా అంతమొందించి ఉండేవాళ్లమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.
శుక్రవారం ఓ న్యూస్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన అమిత్ షా, జస్టిస్ సుదర్శన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. “జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి సహకరించిన వ్యక్తి. ఆయన ఇచ్చిన సల్వా జుడుం తీర్పు వల్లే నక్సల్ ఉగ్రవాదం ఏళ్లపాటు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ వామపక్ష ఒత్తిడికి లొంగి ఇలాంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది” అని ఆయన ఆరోపించారు. సల్వా జుడుం 2005లో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను ఎదుర్కోవడానికి ఏర్పాటైన ఒక పౌర సైన్యం. ఇందులో గిరిజన యువతకు ఆయుధ శిక్షణ ఇచ్చి స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా నియమించారు. అయితే ఈ దళంపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు రావడంతో 2011లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ దళాన్ని రద్దు చేస్తూ చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ తీర్పు ద్వారా నక్సలిజం సిద్ధాంతాలకు పరోక్షంగా మద్దతిచ్చారని, సుప్రీంకోర్టు వంటి పవిత్ర వేదికను దుర్వినియోగం చేశారని అమిత్ షా విమర్శించారు. “సల్వా జుడుం తీర్పు రాకపోయి ఉంటే, నక్సలిజం 2020 నాటికే అంతమై ఉండేది,” అని ఆయన పేర్కొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ ఆరోపణలను ఖండించారు. “నేను భారత హోంమంత్రితో నేరుగా వివాదంలోకి దిగాలని అనుకోవడం లేదు. ఆయన రాజ్యాంగ బాధ్యత జీవితాలను రక్షించడం. నా తీర్పులు రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి,” అని పేర్కొన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలను రాజ్యాంగ విరుద్ధం అని ఖండించారు. “సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఇలా అవమానించడం బీజేపీ రాజ్యాంగ సంస్థలపై దాడి చేస్తోందనడానికి నిదర్శనం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ విలువలను గౌరవించే న్యాయమూర్తి. ఆయనపై ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటు” అని ఖర్గే అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ కూడా అమిత్ షా వ్యాఖ్యలను తప్పుపట్టారు. “సల్వా జుడుం తీర్పు మానవ హక్కులను కాపాడేందుకు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు. దాన్ని నక్సలిజంతో ముడిపెట్టడం బీజేపీ రాజకీయ ఎజెండాను సూచిస్తుంది,” అని ఆమె విమర్శించారు.
సెప్టెంబర్ 9, 2025న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు ఉపరాష్ట్రపతి ఎన్నికలను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి.