Janasena: ఏపీ యూత్ మనసు గెలుచుకున్న పవన్..
జనసేన పార్టీ (Janasena Party) స్థాపన నుంచి ప్రజలలో, ముఖ్యంగా యువతలో, ఒక ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ అధినేత ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తరచూ పార్టీని విస్తరించాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రణాళికలు పూర్తిస్థాయిలో అమలుకాలేదు. అయినప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా యువత జనసేన వైపు ఆకర్షితమవడం ఆ పార్టీ భవిష్యత్తుకు బలం ఇస్తోంది.
తాజాగా నిర్వహించిన కొన్ని ఆన్లైన్ సర్వేల్లో యువత రాజకీయాలపై ఆసక్తి పెరుగుతోందని తేలింది. ముఖ్యంగా జనసేన వైపు మొగ్గు చూపుతున్న యువతలో మెజారిటీ తటస్థ వర్గం వారేనని, వారు కేవలం అభిమానం కారణంగా కాకుండా అవకాశాలు ఎక్కువగా ఉన్న పార్టీగా జనసేనను ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. “రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీని ఎంచుకుంటారు?” అనే ప్రశ్నకు ఎక్కువమంది యువకులు స్పష్టంగా జనసేన అని సమాధానం ఇచ్చారు. రెండవ స్థానంలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నిలిచింది.
యువత అభిప్రాయాలను విశ్లేషిస్తే, వారిలో చాలామంది “జనసేనలో ఎదిగే అవకాశం ఉంది” అని నమ్ముతున్నారు. ముఖ్యంగా అనంతపురం (Anantapur), కర్నూలు (Kurnool) జిల్లాల్లో యువత జనసేనకు మద్దతు తెలిపింది. వారు పార్టీతో కలిసి భవిష్యత్తులో వ్యూహాత్మకంగా పనిచేయాలనే ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో (East and West Godavari) కొంతమంది యువత నేరుగా రాజకీయాల్లోకి రావడం కాకుండా సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యకలాపాలను విశ్లేషించాలనే నిర్ణయానికి వచ్చారు. రాజకీయాల్లోకి వస్తే ఆదాయం ఉంటుందా? అనే ప్రశ్నకు నేటి యువతలో చాలా స్పష్టత ఉన్నట్లు తెలుస్తోంది. వారికి రాజకీయాలు సేవామార్గమని, వెంటనే లాభం పొందడం కష్టమని అవగాహన ఉంది.
ఈ స్పష్టత యువతలో రాజకీయ పరిపక్వత పెరిగిందనే సంకేతంగా చెప్పవచ్చు. మొత్తం రాష్ట్రంలో సుమారు 60 శాతం మంది యువత జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని అంచనా. ఇది పార్టీకి ఒక పెద్ద బలం అయినప్పటికీ, ఆ ఉత్సాహాన్ని కొనసాగించడం నాయకత్వంపై ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ పలు సమావేశాల్లో యువతకు శిక్షణ ఇవ్వడం, వారిని చురుకుగా రాజకీయాల్లోకి తీసుకురావడం గురించి ప్రకటించినా, ఇప్పటివరకు ఆ ప్రణాళికలు రూపుదాల్చలేదు. పవన్ చెప్పినట్లు పార్టీ నిర్మాణం వ్యవస్థీకృతంగా జరిగితే, యువతను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే, పవన్ మాట కోసం ఎదురు చూస్తున్న యువత సిద్ధంగా ఉంది. వారు జనసైన్యంలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు. మరి ఈ దిశగా పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..








