అమెరికాను కనిపెట్టింది భారతీయుడే… కొలంబస్ కాదు

అమెరికాను కనిపెట్టింది అందరూ అనుకుంటున్న క్రిస్టఫర్ కొలంబర్ కాదని, భారతీయుడని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ తెలిపారు. తప్పుడు చరిత్రను విద్యార్థులకు బోధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని, వాస్తవాలను తెలపాలని అన్నారు. భారత్‌కు సముద్ర మార్గాన్ని కనిపెట్టింది కూడా వాస్కోడిగామా కాదని, ఓ గుజరాత్ వ్యాపారి అని తెలిపారు. ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న పర్మార్ బరకాతుల్లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రసంగించారు. అమెరికాను గొప్ప భారతీయ నావికుడు వాసులున్ కనిపెట్టారు. ఎనిమిదో శతాబ్దంలో ఆయన శాంటియాగో వెళ్లారు. అక్కడ ఎన్నో ఆలయాలను నిర్మించారు. అక్కడి మ్యూజియంలోని గ్రంథాలయంలో ఈ వాస్తవాలు ఉన్నాయి. అమెరికాను కనిపెట్టింది కొలంబస్ కాదు, మన పూర్వీకుడే అని విద్యారుథలకు బోధించాలి. వాస్కోడిగామా భారత్‌కు సముద్ర మార్గం కనిపెట్టారని చెప్పడమూ తప్పే. చందన్ గుజరాత్ వ్యాపారవేత్తను ఆఫ్రికాలోని జాంజిబార్ నౌకాశ్రయంలో వాస్కోడిగామా కలిశారు. ఆ సందర్భంగా భారత్‌ను చూడాలన్న ఆసక్తిని చందన్ ముందు ఆయన వ్యక్తపరిచారు. అలా చందన్ నౌకల వెనక వాస్కోడిగామా భారత్‌కు వచ్చారు. తన నౌక కన్నా చందన్ నౌకే పెద్దదని వాస్కోడిగామాయే స్వయంగా తన ఆత్మకథలో రాశారు అని పర్మార్ పేర్కొన్నారు.