Air India Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం..!

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఎయిర్ ఇండియా (Air India) విమానం ఘోర ప్రమాదానికి గురైంది. లండన్‌లోని (London) గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది. విమానంలో 230 మంది మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులు ఉన్నట్లు సమాచారం. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మేఘనీనగర్ (Meghani Nagar) ప్రాంతంలో జరిగింది. కూలిపోయిన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Ex CM Vijay Rupani) కూడా ఉన్నారు.
ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (రిజిస్ట్రేషన్ VT-ANB) విమానం మధ్యాహ్నం 1:38కి రన్‌వే 23 నుంచి టేకాఫ్ అయింది. కానీ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సుమారు 1:47 గంటలకు.. విమానాశ్రయ సమీపంలోని ఒక భవనాన్ని ఢీకొని కూలిపోయింది. విమానం నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మేఘనీనగర్ ప్రాంతంలో దట్టమైన నల్లని పొగలు ఆకాశంలో కనిపించాయి. భారీ శబ్దం వినిపించిందని.. ఆ తర్వాత మంటలు, పొగలు కనిపించినట్లు స్థానికులు తెలిపారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం, విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు మేడే కాల్ వచ్చినట్లు సమాచారం. కానీ కొద్ది సెకన్లలోనే విమానంతో ATCకి సంబంధాలు తెగిపోయాయి. సమీపంలోనే అది కూలిపోయింది. నివాస ప్రాంతంలో కూలడంతో భవనం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 12 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగాయి. స్థానిక ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. గాయపడిన వారిని చికిత్స కోసం తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సూరత్ నుంచి అహ్మదాబాద్‌కు వెంటనే బయలుదేరి వెళ్లారు. రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి, పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరారు. పరిస్తితిని ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రామ్మోహన్ నాయుడికి కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు. విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. “ఫ్లైట్ AI171, అహ్మదాబాద్-లండన్ గాట్విక్, ఈ రోజు, జూన్ 12, 2025న ఒక ప్రమాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం మేము వివరాలను సేకరిస్తున్నాము” అని తెలిపింది.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా విమానంలో ఉన్నట్లు ప్యాసెంజర్ లిస్ట్ తెలియజేస్తోంది. ఆయన తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశీయులు, ఏడుగురు పోర్చుగీస్, ఒక కెనడా దేశస్థుడు ఉన్నట్టు గుర్తించారు. దాదాపు వంది మంది ఈ ఘటనలో చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.
ప్రమాదం జరిగిన మేఘనీనగర్ ప్రాంతంలోని రహదారులన్నీ మూసివేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సాయంత్రం 5 గంటల వరకూ తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసింది. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద స్థలంలో గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.