Amith Shah: బీజేపీతోనే అన్నాడీఎంకే..? పొత్తుపొడుపుపై ఊహాగానాలు..?

2026లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో సేమ్ టు సేమ్… పాత విపక్షాలే బలంగా తలపడనున్నాయి. ఇప్పటికే ఓవైపు తమిళనాడులో అధికార పార్టీ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే.. ఇండియా కూటమితో కలిసి పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు .. అన్నాడీఎంకే.. బీజేపీతో కలిసి పోటీకి దిగే పరిస్థితులున్నాయి. కేంద్రహోంమంత్రి అమిత్ షాతో.. అన్నాడీఎంకే(AIADMK) చీఫ్ పళనిస్వామి.. ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
అయితే తాను రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, తమిళనాడు లిక్కర్ స్కాముకు సంబంధించి అమిత్ షాతో చర్చించానన్నారు పీఎస్. పొత్తుల విషయాలు చర్చకు రాలేదన్నారు. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేను ఓడించడమే తమ ఏకైక లక్ష్యమని, ఇందుకోసం ఎలాంటి పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చినా దానిపై 2026 ఎన్నికల ముందు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
బీజేపీతో పొత్తు పెట్టుకునేది లేదని గతంలో చేసిన వ్యాఖ్యలపై అడిగినప్పుడు, భాగస్వామ్య పార్టీలను మార్చని పార్టీ ఒక్కటైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. తమకు పార్టీ సిద్ధాంతం, పొత్తులు అనేవి రెండు వేర్వేరు అంశాలనీ, సిద్ధాంతాలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయని, పొత్తులనేవి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని అన్నారు. ఎన్నికలు దగ్గర పడినప్పుడు పొత్తులపై ఒక నిర్ణయం తప్పనిసరిగా తీసుకుంటామని, మీడియాకు కూడా తెలియజేస్తామని నవ్వుతూ చెప్పారు. అయితే ఒకటి మాత్రం స్పష్టమని, డీఎంకేనే తమ ప్రత్యర్థి అని, 2026 ఎన్నికల్లో డీఎంకేను ఓడించడమే తమ ఏకైక లక్ష్యమని పళని స్వామి చెప్పారు.
మరోవైపు..రాష్ట్ర రాజకీయ చరిత్రలో 2026 అసెంబ్లీ ఎన్నికలు భిన్నంగా ఉండనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(ANNA MALAI) తెలిపారు. డీఎంకేను అధికారం నుంచి దింపాలన్నదే అందరి కోరిక అన్నారు. ఎన్డీయే కూటమిలో ఎవరైనా చేరొచ్చని తెలిపారు. ముస్లిం మిత్రులతో బీజేపీ ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటుందని చెప్పారు. ముస్లింలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని అంగీకరించారని, ఇది చూసి ముఖ్యమంత్రి స్టాలిన్ అసూయపడుతున్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన పార్టీలు 4, 5 కూటములుగా ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. డీఎంకే నేతృత్వంలోని కూటమి, అన్నాడీఎంకే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, సీమాన్, విజయ్..ఇలా పంచముఖ పోటీకి అవకాశం ఉందన్నారు.