Hydrogen plant : దేశంలో తొలి హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం

గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో కీలక ముందడుగు పడిరది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani )కి చెందిన అదానీ గ్రూప్ భారత్‌లోనే తొలి ఆఫ్‌గ్రిడ్ 5 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్‌ను గుజరాత్ (Gujarat) లోని కచ్‌లో ప్రారంభించింది. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక వనరులను ఉపయోగించుకొని నీటిని ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియ ద్వారా విభజించి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్ ముఖ్యఉద్దేశం. సొంత పునరుత్పాదక కేంద్రాలను అదానీ గ్రూప్ (Adani Group) వినియోగించుకుంది. హైడ్రోజన్ వాయువు విశ్వంలో అత్యంత తేలికైనది, స్వచ్ఛమైనది. ఇది మండినప్పుడు కేవలం నీటి ఆవిరిని ఉత్పత్తి చేస్తుంది. దేశీయ అవసరాలకు దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవడం లో భాగంగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (National Green Hydrogen Mission) ను కేంద్రం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 5 మెగావాట్ ప్లాంట్‌ను నెలకొల్పింది. దేశ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో దీన్నో కీలక ముందడుగుగా అదానీ గ్రూప్ అభివర్ణిచింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో హబ్‌గా నిలవాలన్న భారత సంకల్పానికి అదానీ గ్రూప్ తనవంతు తోడ్పాటు అందిస్తోందని పేర్కొంది. గుజరాత్‌లోని ముంద్రాలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను కూడా అదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తోంది.