మరోసారి అమెరికాకు ఉక్రెయిన్ మొర.. అనుమతి ఇస్తే పేల్చేస్తాం
రష్యాకు ఇరాన్ 2022 నుంచి షాహిద్ డ్రోన్లను సరఫరా చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ యుద్ధంలో అవి సృష్టించిన విధ్వంసం తెలిసిందే. వేల సంఖ్యలో షాహిద్ డ్రోన్లను మాస్కో ప్రయోగించింది. ఫలితంగా భారీగా నష్టపోయిన ఉక్రెయిన్ను ఇప్పుడు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను రష్యాకు సరఫరా చేసిందన్న వార్త భయపెడుతోంది. ఈ విషయాన్ని అమెరికా కూడా ధ్రువీకరించింది. త్వరలో ఈ బాలిస్టిక్ క్షిపణులు తమ నగరాలపై విరుచుకుపడతాయన్న ఆందోళన కీవ్‌ను కలవరపరుస్తోంది. దీంతో మరోసారి దీర్ఘశ్రేణి క్షిపణులు వాడేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా, దాని మిత్ర దేశాలకు ఉక్రెయిన్ మెరపెట్టుకుంది. ఇందుకు అనుమతిస్తే రష్యాలోని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఉన్న గోదాములను పేల్చివేస్తామని చెబుతోంది. అయితే రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులు వినియోగానికి పశ్చిమ దేశాలు ససేమిరా అంటున్నాయి. అనుమతిస్తే యుద్ధం విస్తరిస్తుందన్న ఆందోళన అమెరికా, దాని మిత్రదేశాలకు ఉంది. అందుకే ఈ అనుమతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.






