భారత్ తీసుకొచ్చిన ఒప్పందం భేష్ .. చైనా అధ్యక్షుడి ప్రశంసలు
వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్ధు వివాదానికి సంబంధించి భారత్‌తో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత విదేశాంగ విధానంలో ప్రధానమైన పంచశీల ఒప్పందాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న ఘర్షణలకు ముగింపు పలకడానికి ఆ ఐదు సూత్రాలు మెరుగ్గా పని చేస్తాయన్నారు. భారత్-చైనా మధ్య కుదిరిన ఒప్పందాన్ని పంచశీల ఒప్పందానికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్‌పింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందం అనివార్యమైన చారిత్రక పరిణామం. శాంతి, అభివృద్ధికి ఈ ఐదు సూత్రాలు సమాధానమిచ్చాయి. చైనా-భారత్, చైనా-మయన్మార్‌తో సంయుక్త ప్రకటనల్లోనూ ఈ సూత్రాలను మా గత నాయకత్వం చేర్చింది. దేశాల మధ్య బలమైన సంబంధాలకు వీటిని ప్రాథమిక నిబంధనలుగా చేర్చాలని సంయుక్తంగా పిలుపునిచ్చింది అని జిన్‌పింగ్ గుర్తు చేశారు.






