రష్యా నూతన రక్షణ మంత్రిగా.. ఆండ్రీ బెలౌసోవ్
రష్యా అద్యక్షుడిగా ఐదో విడత బాధ్యతలు చేపట్టిన వ్లాదిమిర్ పుతిన్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసింది. పాత కేబినెట్లో రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు మాత్రమే అవకాశమివ్వలేదు. రక్షణ శాఖ సహాయ మంత్రి తిమూర్ ఇవనోవ్ అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడంతో షోయిగుకు పదవీ గండం తప్పదని కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. అధ్యక్షుడు పుతిన్ నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్(65)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. షోయిగుకు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ బాధ్యతలను అప్పగించారు. ఆండ్రీ బెలౌసోవ్ 2020 నుంచి ఫస్ట్ డిప్యూటీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. అంతకుముందు ఏడేళ్లపాటు పుతిన్ సలహాదారుగా ఉన్నారు.






