తాత్కాలిక ప్రభుత్వానికి పూర్తి మద్దతు : అమెరికా
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా ప్రకటించింది. తాత్కాలిక ప్రభుత్వంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని తెలిపింది. అమెరికా చార్జి డీ అఫైర్స్ హెలెన్ లాఫవె స్టేట్ గెస్ట్ హౌస్‌లో ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ మహ్మద్ యూనస్‌తో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. బంగ్లా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ వారంలో ఢాకాలో అమెరికా ఎంబసీలో వీసా ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్యం, విద్య, కార్మిక వ్యవహారాలు, రోహింగ్యా సంక్షోభం వంటి కీలక రంగాల్లో బంగ్లాదేశ్‌కు సహకరించనున్నట్లు తెలిపారు. రోహింగ్యా శరణార్థులకు మానవతా సాయాన్ని అందచేయడానికి ఈ ఏడాది నిధులు పెంచనున్నట్లు తెలిపారు. వారికి జీవనోపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం వుందన్నారు. అమెరికా అందచేస్తున్న మద్దతుకు యూనస్ కృతజ్ఞతలు తెలియచేశారు.






