ఆ ఆలోచన ఉక్రెయిన్‌కు ఉంటే.. దానికి తాము సిద్ధం : పుతిన్
భారత్‌కు అథిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం విషయంలో, భారత్ అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్‌తో పాటు మరో రెండు దేశాల మాటలను కూడా ఆలకిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ అంశంలో భారత్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. యుద్ధ సమస్యను పరిష్కరించేందుకు భారత్ చాలా నిష్టతో పనిచేస్తున్నట్లు తెలిపారు. వాడివొస్టోక్లో జరిగిన ఈస్ట్రన్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సు అంశాలపై పుతిన్ పేర్కొన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన ఉక్రెయిన్‌కు ఉంటే, దానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ వెల్లడించారు.
అయితే ఇటీవల కొన్ని వారాల క్రితం భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ ఆయన అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిశారు. ఈ నేపథ్యంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. స్నేహితులను, భాగస్వామ్యులను గౌరవిస్తామని, ఉక్రెయిన్‌తో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చైనా, బ్రెజిల్, ఇండియా ఇస్తున్న సలహాలను స్వీకరిస్తున్నామని, ఈ అంశంపై మిత్రదేశాలతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు పుతిన్ చెప్పారు.






