America: కరోలినాలో అగ్గి రాజేసిన మహిళ అరెస్ట్
అమెరికాలోని ఉత్తర కరోలినా(North Carolina) , దక్షిణ కరోలినా (South Carolina) రాష్ట్రాల్లో 4వేల ఎకరాలను కాల్చి బూడిద చేసిన కార్చిచ్చుకు కారణమైన మహిళను అధికారులు అరెస్టు చేశారు. దక్షిణ కరోలినాలోని మిర్టిల్ బీచ్‌కు చెందిన అలెగ్జాండ్రా బియాలౌసౌ(40) (Alexandra Bialousa ) గా ఆమెను గుర్తించారు. కోవింగ్టన్ లేక్స్ సబ్ డివిజన్లోని తన ఇంటి వెనుక చెట్టు వద్ద అలెగ్జాండ్రా మంట వెలిగించడంతో కార్చిచ్చు మొదలైనట్లు అధికారులు వెల్లడిరచారు. వేగంగా వీస్తున్న గాలులు ధాటికి మంటలు పక్కనే ఉన్న వాకర్ వుడ్స్ (Walker Woods) యాజమాన్యంలోని వృక్షాల మీదుగా మిర్టిల్ బీచ్ (Myrtle Beach) సమీపంలోని పలు నివాసాలకు అంటుకున్నాయని తెలిపారు. మంటలను ఆర్పడానికి ఆమె ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి, అధికారులు, అత్యవసరస్థితిని ప్రకటించారు. అనవసర వస్తువులు, చెత్తను కాల్చడంపై ఆంక్షలు కొనసాగుతున్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం నాటికి మంటలు 55 శాతం అదుపులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 15న అలెగ్జాండ్రా హోరీ కౌంటీ కోర్టు (Horry County Court )లో హాజరు కావాల్సి ఉంటుంది. దోషిగా తేలితే ఆమెకు కోర్టు 30 రోజుల జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.






