America: రష్యాకు ఆయుధ సాయం చేయొద్దు.. చైనాకు అమెరికా వార్నింగ్..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అమెరికా-చైనా మధ్య దూరాన్ని మరింతగా పెంచుతోందా..? రష్యాను ఒంటరి చేయాలని అమెరికా భావిస్తుంటే.. రష్యాకు వెన్నుదన్నుగా ఉండి ఆయుధ సాయం రష్యా చేస్తోందా..? అంటే అమెరికా, ఇజ్రాయెల్ అవుననే అంటున్నాయి. ఈఆటను చైనా వీలైనంత వేగంగా కట్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీనికి చైనా సైతం అంతే ధీటుగా బదులిచ్చింది. శాంతిని నెలకొల్పడం చేతకాదు.. కానీ నీతులు చెబుతారా అంటూ రివర్స్ కౌంటర్ వేసింది
ఐక్యరాజ్య సమితి వేదికగా అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఉక్రెయిన్‌పై రష్యా (Russia) చేస్తున్న దాడులకు ఉపయోగపడే వస్తువులను ఎగుమతులు చేయడం ఆపేయాలంటూ బీజింగ్‌ను అమెరికా (USA) హెచ్చరించింది. ఈక్రమంలో అమెరికా తాత్కాలిక రాయబారి డోరతీ షియా మాట్లాడుతూ.. ఉక్రెయిన్ (Ukraine)కు వ్యతిరేకంగా ఉపయోగించే డ్రోన్‌లు, క్షిపణులలో ఉపయోగించే భాగాలతో సహా రష్యా సైనిక సామర్థ్యాలకు దోహదపడే ఎగుమతులు నిలిపివేయాలని పేర్కొన్నారు. ఈసందర్భంగా చైనా పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీని కారణంగా డ్రోన్, క్షిపణి దాడులు మరింత తీవ్రతరమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. సంఘర్షణను అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఇది బలహీనపరుస్తుందన్నారు. ఈసందర్భంగా శాంతి నెలకొల్పాలనే ఉద్దేశం చైనాకు నిజంగా ఉంటే మాస్కో దూకుడుకు ఆజ్యం పోయడం మానేయాలని హెచ్చరించారు.
ఈ ఆరోపణలను చైనా తిప్పికొట్టింది. ఆ దేశ డిప్యూటీ రాయబారి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని చైనా ప్రారంభించలేదు. సంఘర్షణలో భాగం కాలేదు. ప్రాణాంతక ఆయుధాలను ఎప్పుడూ అందించలేదు. డ్రోన్‌లతో సహా పలు వస్తువుల ఎగుమతులపై కఠిన వైఖరితోనే ఉన్నాం. కీవ్ సమస్యపై అమెరికా నిందలు వేయడం మాని.. శాంతిచర్చల్లో సరైన పాత్ర పోషించండి’ అని కౌంటర్ ఇచ్చారు. దీనికి ముందు రాయిటర్స్ తన కథనంలో పశ్చిమదేశాల ఆంక్షలు పడకుండా చైనా రహస్యంగా రష్యాకు ఆయుధాలు తరలించిందని పేర్కొంది.