Trump: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు.. ఇరాన్ లో సైనిక సిబ్బందిని వెనక్కు పిలిపించిన ట్రంప్..

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొంటున్నాయి. ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ (Israel) పూర్తిగా సిద్ధమైందని అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ (Iran) దాడి చేయోచ్చని వారు పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ కూడా కెన్నడీ సెంటర్‌లో మాట్లాడుతూ పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామన్నారు. ఆరో రౌండ్ అణుచర్చల కోసం ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఇరాన్ ప్రతినిధులతో సమావేశం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇరాన్‌తో అమెరికా ఒప్పందం చేసుకోవడంపై ఇజ్రాయెల్ ప్రధాని విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలకు ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకూ ఓ సలహా ఇచ్చారు. గాజాలో యుద్ధాన్ని ఆపాలని కోరినట్లు సీఎన్‌ఎన్ పేర్కొంది. వీరిద్దరి మధ్య సోమవారం ఫోన్‌కాల్ సంభాషణ జరిగింది. ఈసందర్భంగా ఇరాన్‌పై దాడి గురించి బహిరంగంగా మాట్లాడటం ఆపాలని, దాడుల ప్లాన్ పక్కన పెట్టాలని ట్రంప్ కోరారు. దీనికి బదులుగా నెతన్యాహు మాత్రం ఇరాన్‌కు ఒప్పందం చేసుకొనే ఉద్దేశమే లేదని పేర్కొన్నారు. ఇరువురు నేతల మధ్య ఇటీవల దూరం పెరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ పశ్చిమాసియా పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్‌కు ప్రాధాన్యం ఇవ్వలేదు.
అమెరికా జాగ్రత్త..!
ఒకవేళ చర్చలు విఫలమైన వేళ మాపై దాడులు జరిగితే మాత్రం.. విదేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని హెచ్చరించారు ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్‌జాదా. మరోవైపు ఇరాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్‌గా భావిస్తున్న దానిలో ‘మేము సిద్ధంగా ఉన్నాం’ అంటూ పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ట్రంప్ ఇరాక్‌లో ఉన్న దౌత్య సిబ్బంది, సైనిక కుటుంబాలు వెనక్కి రావాలని ప్రకటించారు.
* యూకే మారిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ బుధవారం నౌకలకు హెచ్చరికలు జారీ చేసింది. పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి, ఒమన్ తీరంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి ఈ మార్గం అత్యంత కీలకం.
ఇరాన్‌పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధం చేసుకొన్న రహస్య ప్లాన్‌ను లీక్ చేసిన మాజీ సీఐఏ విశ్లేషకుడు ఆసీఫ్ రహ్మన్‌కు అమెరికా న్యాయస్థానం 37 నెలల జైలు శిక్షను విధించింది. 2016 నుంచి సీఐఏలో పనిచేస్తున్న రహ్మాన్ 2024లో ఈ లీక్‌కు పాల్పడ్డాడు.