US Visa:88 లక్షల స్కాలర్‌షిప్ వచ్చినా .. భారత స్టూడెంట్‌కు వీసా రిజెక్ట్ చేసిన యూఎస్!

అమెరికాలో (US Visa) ఉన్నత విద్య కోసం కలలు కనే భారతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం నీళ్లు కుమ్మరిస్తోంది. తాజాగా వెలుగు చూసిన ఘటనే దీనికి నిదర్శనం. ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీలో జర్నలిజం కోర్సులో సీటు సంపాదించిన కౌశిక్ రాజ్ (Koushik Raj) అనే విద్యార్థికి ఏకంగా $1,00,000 డాలర్ల (దాదాపు రూ. 88 లక్షలు) భారీ స్కాలర్‌షిప్ కూడా సాధించాడు. అయినా సరే అతనికి స్టూడెంట్ వీసా (F-1) ఇచ్చేందుకు యూఎస్ (US Visa) నిరాకరించింది. ఇలా ఎందుకు చేశామో కూడా అమెరికా అధికారులు స్పష్టంచేశారు.
చదువు పూర్తయిన తర్వాత కౌశిక్ తిరిగి స్వదేశానికి వెళతాడన్న నమ్మకం తమకు కలగడం లేదని, అందుకే వీసా (US Visa) ఇవ్వడం లేదని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ఎఫ్-1 వీసా నిబంధనల ప్రకారం, తమ చదువు తాత్కాలికమేనని, కోర్సు పూర్తయిన తర్వాత తిరిగి వెళ్లడానికి స్వదేశంలో బలమైన కుటుంబ, సామాజిక బంధాలు ఉన్నాయని విద్యార్థులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. 27 ఏళ్ల కౌశిక్ రాజ్ ఈ విషయంలో విఫలమైనట్లు యూఎస్ (US) అధికారులు తేల్చిచెప్పారు.
షాకయ్యా అంటున్న స్టూడెంట్..
ఈ అనూహ్య నిర్ణయంపై కౌశిక్ రాజ్ (Koushik Raj) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన కుటుంబం, బంధువులు అందరూ భారత్‌లోనే ఉన్నప్పటికీ వీసా (US Visa) ఎందుకు రిజెక్ట్ చేశారో తెలియడం లేదని ఆయన అన్నారు. గతంలో జర్నలిస్టుగా పనిచేసినప్పుడు తాను సోషల్ మీడియాలో (Social Media) కొన్ని వార్తా కథనాలను షేర్ చేశానని, వాటికి సంబంధించిన లింకులను వీసా (US Visa) అధికారులు పరిశీలించి ఉండొచ్చని కౌశిక్ చెప్పారు. అవి చూసి తాను అమెరికాలో స్థిరపడటానికే ప్రయత్నిస్తున్నట్లు వాళ్లు అపార్థం చేసుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే తమ నిర్ణయంపై అప్పీల్ చేసుకునే అవకాశం లేదని, వీసా (US Visa) కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ విషయం తెలిసిన భారతీయ విద్యార్థులు తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైతే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.