Minister Lokesh: టాటా సంస్థల ప్రతినిధులకు మంత్రి లోకేశ్ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పలు సంస్థల సీఈఓలు, ఎండీలు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌లతో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ముంబయిలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు. రాష్ట్రంలో ఈవీ ఛార్జింగ్ సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని టాటాపవర్ రెన్యూవబుల్స్‌ను మంత్రి లోకేశ్ కోరారు. రాష్ట్రంలో సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన పరిశీలించాలని పేర్కొన్నారు. విశాఖలో టాటా ఎల్క్సీ ప్రాంతీయ కార్యాలయం/ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, తూర్పుతీరంలో ప్రధాన కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.
టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ (Chandrasekaran)తో లోకేశ్ ముంబయిలో సమావేశమయ్యారు. టాటా పవర్ రెన్యూవబుల్స్ సీఈఓ సంజయ్‌కుమార్ బంగా, ఇండియా హోటల్స్ ఎండీ పునీత్‌ఛత్వాల్, టాటా ఎల్క్సీ సీఈఓ మనోజ్ రాఘవన్, టాటా ఆటోకాంప్ సీఈవో మనోజ్ కొల్హాత్కర్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సీఈఓ సుకరణ్‌సింగ్, టాటా ఎలక్ట్రానిక్స్ ఎండీ రణధీర్ ఠాకూర్, టాటా కెమికల్స్ ఎండీ ఆర్. ముకుందన్, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సీఈఓ వినాయక్‌పాయ్, ఎస్‌టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ సీఈవో బిమల్ ఖండేల్వాల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల విశాఖ (Visakhapatnam)లో నిర్వహించనున్న టీసీఎస్ (TCS) డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని వారిని ఆహ్వానించారు.