T-Congress: ‘దున్నపోతు’ వివాదం.. తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు!

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పార్టీలో ఇద్దరు కీలక మంత్రుల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), ఎండోమెంట్స్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధం, పార్టీలో కులం అంశాన్ని తెరపైకి తెచ్చింది.
ఈ వివాదం ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (JubileeHills Byelection) నిర్వహణపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మొదలైంది. ప్రెస్ మీట్ ప్రారంభానికి ముందు, మంత్రి పొన్నం ప్రభాకర్ తన పక్కనే ఉన్న మరో మంత్రి వివేక్ వెంకటస్వామితో (Vivek Venkata Swamy) గుసగుసలాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆలస్యంగా సమావేశానికి వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశిస్తూ ‘వాడు ఓ దున్నపోతు, వాడికేం తెలుసు’ అంటూ పొన్నం మాట్లాడినట్లుగా ఆ సమయంలో లైవ్‌లో ఉన్న మైక్‌లలో అవి రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం రాజుకుంది.
పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ఆయన మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. తనను సహచర మంత్రే ఇలా బాడీ షేమింగ్ చేస్తూ, ఒక జంతువుతో పోల్చడం తనను తీవ్రంగా అవమానించిందని తెలిపారు. రేపటిలోపు పొన్నం ప్రభాకర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
దళిత సామాజిక వర్గంలో పుట్టడమే నేను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై ఆయన కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లకు లేఖలు రాశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలుస్తానని, పార్టీలో జరుగుతున్న అహంకార పూరిత ధోరణిని వివరిస్తానని ఆయన స్పష్టం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వివాదంపై వివరణ ఇచ్చారు. తాను లక్ష్మణ్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని గట్టిగా వాదించారు. ఢిల్లీ టికెట్ కన్ఫర్మేషన్ ఆలస్యం కావడంతో తన సిబ్బందిని ఉద్దేశించి చేసిన సాధారణ వ్యాఖ్యలని, వాటిని కొందరు కావాలనే వక్రీకరించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అడ్లూరి లక్ష్మణ్ అంటే తనకు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో గౌరవం ఉందని, ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన పరోక్షంగా అభిప్రాయపడ్డారు.
ఈ వివాదం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత గ్రూపు రాజకీయాలకు వేదికగా మారింది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు దళిత నేతలు అడ్లూరి లక్ష్మణ్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దళిత మంత్రిని కించపరచడంపై వారు పొన్నం ప్రభాకర్‌ను తీవ్రంగా విమర్శించారు. పొన్నం క్షమాపణ చెప్పకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇద్దరు మంత్రులను సంయమనం పాటించాలని కోరారు. ఇద్దరూ ముఖ్యమైన మంత్రులేనని, ఇలాంటి వివాదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల సమయంలో ఇలాంటి అంతర్గత వివాదం బయటపడటం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇది దళితుల ఓట్లను, మద్దతును ప్రభావితం చేయవచ్చనే ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.