Nobel Prize: వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి

మన శరీరంలోకి చొరబడే హానికారక సూక్ష్మజీవులపై యుద్ధం ప్రకటించి, కాపుగాయాల్సిన రోగనిరోధక వ్యవస్థ, మన అవయవాలపైనే దాడి చేయకుండా చేసే పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ పై కీలక పరిశోధనలు చేసిన మేరీ ఈ బ్రన్‌కో (64), ఫ్రెడ్ రామ్స్‌డెల్ (64), సకగూచి(74)లను ఈ ఏటి వైద్య నోబెల్ (Nobel Prize) వరించింది. వీరిలో బ్రన్‌కో (Branco) , రామ్స్‌డెల్ అమెరికన్లు కాగా, సకగూచి జపనీయుడు. బ్రన్‌కో సియాటెల్ లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీ లో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రామ్స్‌డెల్ (Ramsdell) శాన్‌ఫ్రాన్సిస్కోలోని సోనోమా బయోథెరప్యూటిక్స్ లో శాస్త్రీయ సలహాదారుగా పనిచేస్తున్నారు. సకగూచీ (Sakaguchi) ఒసాకా యూనివర్సిటీ (జపాన్) లోని ఇమ్యూనాలజీ ఫ్రాంటియర్ రిసెర్చ్ సెంటర్ గౌరవ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రైజ్‌మనీ కింద ఇచ్చే 10.64 కోట్లను వీరు ముగ్గురూ సమానంగా పంచుకోనున్నారు. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పని తీరును తెలుసుకోవడానికి వారు చేసిన పరిశోధనలే కీలకమని నోబెల్ కమిటీ చైర్ ఒల్లె కాంపె కొనియాడారు.