Pawan Kalyan: కూటమి ఐక్యత కోసం అన్ని భరిస్తూ మౌనం వహిస్తున్న పవన్..

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో మౌనంగా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విజయవాడ (Vijayawada) లో ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నప్పటికీ, తన ప్రసంగాన్ని చాలా క్లుప్తంగా ముగించారు. సాధారణంగా ఉత్సాహంగా మాట్లాడే పవన్ ఈసారి మాత్రం నిశ్శబ్దంగా, తక్కువ మాటల్లోనే కార్యక్రమాన్ని ముగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మంత్రివర్గ సమావేశంలో కూడా ఆయన ఇదే విధంగా మౌనంగా కనిపించారని సమాచారం.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మంత్రివర్గ సభ్యుడు నారా లోకేష్ (Nara Lokesh) పవన్ గురించి ప్రశంసల వర్షం కురిపించారు. లోకేష్ తన ప్రసంగంలో “పవన్ అన్న” అంటూ గౌరవంగా సంభోదించినా, పవన్ చాలా మౌనంగా ఉండిపోయారు. టెలివిజన్ లైవ్‌లో ఈ దృశ్యాలు ప్రసారమయ్యాక రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగింది.
అసెంబ్లీలో జరిగిన బాలకృష్ణ (Balakrishna) ఎపిసోడ్ తర్వాత నుంచే పవన్‌లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పట్ల పవన్‌కు ఉన్న గౌరవం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి గురించి బాలకృష్ణ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పవన్ తీవ్రంగా బాధపడ్డారని, అప్పటినుంచే ఆయన మనసులో విరక్తి నెలకొన్నట్లు చెబుతున్నారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినా, టీడీపీ నాయకత్వం బాలయ్య చేత వివరణ ఇప్పించకపోవడం పవన్‌ను మరింత నిరాశకు గురి చేసిందని అంటున్నారు.
తనకు ఎదురైన ఈ పరిస్థితుల గురించి పవన్ కొందరు సన్నిహితులతో పంచుకున్నట్లు సమాచారం. “కూటమి బలంగా ఉండాలంటే నేను అన్నీ భరిస్తున్నాను” అని ఆయన అన్నారని టాక్. జగన్ (Jagan ) తిరిగి అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతో పవన్ అన్ని రాజీలు పడుతున్నారని అంటున్నారు. కానీ టీడీపీకి చెందిన కొందరు నాయకులు దీనిని తేలికగా తీసుకుంటున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారట.ఇక పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలో కూడా ఆయనకు ఇబ్బందులు టీడీపీ నుంచే వస్తున్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. వైసీపీతో కాకుండా, కూటమి భాగస్వామి టీడీపీతోనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారి వ్యాఖ్య.
పవన్ ఈ మధ్యకాలంలో తన భావోద్వేగాలను అణచుకుంటూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిశ్శబ్దాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఆయనలోని ఆవేదన ఎప్పటిదాకా అదుపులో ఉంటుందో అనేది ప్రశ్న. బాలయ్య ఎపిసోడ్ కూటమిలో చిచ్చు రేపిందని కొందరు చెబుతుంటే, ఇంకొందరు అది తాత్కాలికమేనని భావిస్తున్నారు. ఏదేమైనా పవన్ మౌనం వెనుక ఒక లోతైన ఆలోచన దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.