Eli Lilly: అమెరికా ఫార్మా కంపెనీ భారీ పెట్టుబడులు.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో

అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఔషధ తయారీ కంపెనీ ఎలి లిల్లీ (Eli Lilly) భారతదేశంలోనే తమ మొట్ట మొదటి తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ (Hyderabad) లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. దీనికోసం 100 కోట్ల డాలర్ల (రూ.8,871 కోట్లు) పెట్టుబడులు పెడతామని తెలిపింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)తో భేటీ అయ్యారు. చర్చల అనంతరం ఎలి లిల్లీ కంపెనీ తమ విస్తరణ ప్రణాళిక, తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందించే సహకారంతో అధునాతన ఔషధ తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇక్కడి నుంచే దేశంలో ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ నెట్‌వర్క్ సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందించనున్నట్లు పేర్కొంది. ఫార్మా తయారీ యూనిట్ ఏర్పాటుతో రాష్ట్రంతో పాటు దేశంలో ఫార్మారంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, వీలైనంత త్వరలోనే కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్‌మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారి ఏర్పాటు చేస్తున్న అధునాతన యూనిట్, తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనుందని పేర్కొన్నారు. దేశంలోనే తమ తొలి ఫార్మా తయారీ కేంద్రాన్ని తెలంగాణ (Telangana) లో నెలకొల్పటానికి ముందుకొచ్చింది. ఈ సందర్భం గా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ విస్తరణలో భాగంగా ఎలి లిల్లీ కంపెనీ భారీ పెట్టుబడులకు సిద్ధపడటం ఆనందంగా ఉందని, తెలంగాణకు ఇది ఒక గర్వకారణమని అన్నారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) , ఎలి లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, ఎలి లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రత్యేక కార్యదర్శి సంజయ్‌కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.