RSS: పీఓకే ను భారత్ స్వాధీనం చేసుకోవాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..!

పాక్ ఆక్రమిత కశ్మీరంపై ఆర్ఎస్ఎస్ (RSS) కీలక వ్యాఖ్యలు చేసింది. పీఓకేలో పాక్ బలగాల అణచివేతను పరోక్షంగా ప్రస్తావించిన ఆర్ఎస్ఎస్ చీఫ్.. ఆ ప్రాంతాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) భారతదేశం అనే ఇంట్లోని ఒక గది అని, దానిని ఇతరులు ఆక్రమించుకున్నారని, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. పీఓకేలో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు, హింస చెలరేగుతున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
“భారతదేశం మొత్తం ఒకే ఇల్లు. కానీ మన ఇంట్లోని ఓ గదిని ఎవరో ఆక్రమించుకున్నారు. ఆ గదిలో నా టేబుల్, కుర్చీ, బట్టలు ఉండేవి. దానిని నేను తిరిగి స్వాధీనం చేసుకోవాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన మాటలకు సభలో పెద్ద ఎత్తున చప్పట్లు మారుమోగాయి. దేశ విభజన సమయంలో సింధ్ ప్రాంతం నుంచి వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, వారు అవిభక్త భారతదేశం నుంచే వచ్చారని గుర్తుచేశారు.
అంతకుముందు, పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అంతర్జాతీయ స్పందనలను ప్రస్తావించిన భగవత్, ప్రపంచ వేదికపై మన మిత్రులెవరో ఈ ఘటన తేల్చిందని అన్నారు. దేశ భద్రతా సామర్థ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.
ప్రస్తుతం పీఓకేలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంస్కరణలు కోరుతూ అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) ఆధ్వర్యంలో వేలాది మంది స్థానికులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. గత మూడు రోజులుగా నిరసనకారులకు, పాకిస్థానీ బలగాలకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ముజఫరాబాద్, దాద్యల్, ధిర్కోట్ వంటి ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించకుండా, పాకిస్థాన్ ప్రభుత్వం అణచివేత ధోరణిని అవలంబించడం వల్లే పరిస్థితి మరింత దిగజారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాలుగా కశ్మీర్ విషయంలో ఇస్లామాబాద్ ప్రచారం చేస్తున్న అబద్ధాలను పీఓకే ప్రజల నిరసనలే బట్టబయలు చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.