భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా మద్దతు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, జపాన్, జర్మనీలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనను అమెరికా పునరుద్ఘాటించింది. వీటితో పాటు మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి రెండు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నట్లు అమెరికా శాశ్వత ప్రతినిధి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ ప్రకటించారు. ప్రస్తుతం మండలిలో ఆఫ్రికా దేశాలకు మూడు తాత్కాలిక సీట్లు ఉన్నాయి. అలాగే ప్రపంచంలోని 39 ద్వీప దేశాల్లో ఒకదానికి రొటేషన్ పద్ధతిపై తాత్కాలిక సభ్యత్వం ఇచ్చే ప్రతిపాదననూ సమర్థిస్తున్నామని లిండా గ్రీన్ ఫీల్డ్ తెలియజేశారు. అయితే కొత్తగా శాశ్వతా సభ్యత్వం పొందే దేశాలకు వీటో అధికారం ఇవ్వడానికి తాము సుముఖం కాదని పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా అధికారి చెప్పారు. ఎక్కువ దేశాలకు వీటో అధికారాన్ని ఇస్తే మండలిలో ప్రతిష్ఠంభన ఏర్పడుతుందని అమెరికా భావిస్తోంది. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం కాబట్టి శాశ్వత సభ్యత్వాన్ని బలపరుస్తున్నామనీ, అయితే దీనికి అడ్డుపడేవాళ్లు ఉన్నారనీ, సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసి ఉందని లిండా గ్రీన్ ఫీల్డ్ వివరించారు. ఈ నెల 22, 23వ తేదీల్లో ఇక్కడి ఐరాస ప్రధాన కార్యాలయంలో శిఖరాగ్ర సభ జరగనున్నది. అందులో ప్రధాని మోదీ కూడా పాల్గొంటారు.






