హోరాహోరీ ఫైనల్ బెలారస్ భామదే… యూఎస్ ఓపెన్
హోరాహోరీగా సాగిన తుది పోరులో అద్భుత విజయం సాధించిన బెలారస్ భామ అర్యానా సబలెంక యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన మహిళ సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సబలెంక 7-5,7-5తో జెస్సికా పెగులా ( అమెరికా)ను ఓడించింది. గంటా 53 నిమిషాలపాటు సాగిన పోరులో జెస్సికా కూడా పట్టువదలకుండా పోరాడడంతో చేతులు మారుతూ ఉత్కంఠ రేపింది. అయితే, ఫుల్‌ఫామ్‌లో ఉన్న సబలెంక కీలక సమయంతో ఒత్తిడి తట్టుకొని హార్డ్కోర్ట్ క్వీన్‌గా నిలిచింది. 2023లో కొకో గాఫ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన ఆమె, ఈసారి టైటిల్‌తో మురిసింది. మ్యాచ్‌లో అర్యానా 40 విన్నర్లు సంధిస్తే, పెగులా 17 మాత్రమే కొట్టింది. జెస్సికాతో పోల్చితే సబలెంక ఎక్కువ తప్పిదాలు చేసినా, బలమైన సర్వీస్‌లతో విరుచుకుపడడంతోపాటు తెలివిగా డ్రాప్ షాట్లు ఆడుతూ మ్యాచ్‌ను ఎక్కువగా తన నియంత్రణలోనే ఉంచుకొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకొన్న అర్యానా ఫ్లషింగ్ మెడోస్‌లో నెగ్గి సీజన్‌ను గ్రాండ్‌గా ముగించింది.






