Delhi: ఐఎంఎఫ్ భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉర్జిత్ పటేల్..
ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక పదవి చేపట్టనున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆయన నియమితులయ్యారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో భారత్ వాణిని మరింత బలంగా వినిపించేందుకు ఇది దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపినట్లు సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఉర్జిత్ పటేల్‌కు ఐఎంఎఫ్‌తో పనిచేసిన అనుభవం ఉంది. 1992లో ఆయన న్యూఢిల్లీలో ఐఎంఎఫ్ డిప్యూటీ రెసిడెంట్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆర్‌బీఐలో డిప్యూటీ గవర్నర్‌గా సేవలు అందించి, 2016లో 24వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో ద్రవ్య విధానం, ఆర్థిక పరిశోధన, గణాంకాలు, సమాచార నిర్వహణ వంటి కీలక విభాగాలను పర్యవేక్షించారు.
భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా చేసుకునే విధాన రూపకల్పనలో ఉర్జిత్ పటేల్ కీలక పాత్ర పోషించారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కన్సల్టెంట్‌గా కూడా పనిచేశారు. ప్రభుత్వ పదవులతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐడీఎఫ్‌సీ, ఎంసీఎక్స్ వంటి ప్రైవేట్ సంస్థల్లోనూ ఉన్నత హోదాల్లో పనిచేశారు. ప్రతిష్ఠాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు.







