PM Modi: ఏసియన్ సదస్సుకు వెళ్లట్లేదన్న మోడీ.. ట్రంప్‌తో భేటీ లేనట్లే!
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరగనున్న ఏసియన్ సదస్సు సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలవడం అసాధ్యంగా కనిపిస్తోంది. అక్టోబర్ 26 నుండి 28 వరకు జరిగే ఈ సదస్సులో తాను వ్యక్తిగతంగా హాజరు కావడం లేదని, వర్చువల్‌గానే పాల్గొంటున్నానని ప్రధాని మోడీ ప్రకటించారు. తన షెడ్యూల్ సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఏసియన్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నట్లు మోడీ (PM Modi) పేర్కొన్నారు. ఆసియాన్ సదస్సుకు మోడీ వెళ్లకపోవడంతో, దీనికి అనుసంధానంగా జరగాల్సిన కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది.
ఈ విషయంపై మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో తను ఫోన్‌లో మాట్లాడినట్లు ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోడీ (PM Modi) తెలిపారు. ప్రధానికి బదులుగా విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సదస్సులో పాల్గొననున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో ట్రంప్, మోడీ భేటీ కూడా రద్దయినట్లయింది. ఈ ఇద్దరు నేతలు కలిస్తే అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం పూర్తవుతుందని అంతా అనుకున్నారు. ఈ సదస్సుకు మోడీ (PM Modi) వెళ్లకపోవడంతో ఈ ఇద్దరు నేతల మధ్య సమావేశం కూడా రద్దయినట్లయింది.







